
సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా, రిచా పనై , నైనా ముఖ్యపాత్రల్లో నీలకంఠ తెరకెక్కించిన చిత్రం ‘సర్కిల్’. ఎమ్.వి శరత్ చంద్ర, టి.సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. జులై 7న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నీలకంఠ మాట్లాడుతూ ‘విధి (ఫేట్) అనే కాన్సెప్ట్ కొందరిని ఓ సర్కిల్‌లోకి తీసుకొచ్చి వారి జీవితాలతో ఎలా ఆడుకుందనేది మెయిన్ థీమ్. రొమాన్స్, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఇన్వెస్టిగేషన్ తరహాలో కాకుండా ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. సాయి రోనక్ ఫొటోగ్రాఫర్‌గా కనిపిస్తాడు. అతని చుట్టూ తిరిగే కథ ఇది. ముగ్గురు హీరోయిన్స్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. వాళ్లతో హీరోకు ఉన్న లవ్ ట్రాక్ కంటే లైఫ్ ట్రాక్‌ను చూపించా.
బాబా భాస్కర్ క్యారెక్టర్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. తనదైన శైలిలో కామెడీని టచ్ చేస్తూనే విలన్‌గా మెప్పించాడు. నా గత చిత్రాల కాన్సెప్ట్ ఉంటూనే ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కూడా జోడించాం. ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారనే నమ్మకముంది. ఇక ‘మాయ’ సినిమా తరువాత రెండు ప్రాజెక్ట్‌లకు సైన్ చేశా. వాటితో పాటు ‘మాయ’ హిందీ రీమేక్ కూడా ఆగిపోయింది. వెంకటేష్ గారితో స్వామి వివేకానంద సిరీస్ ప్లాన్ చేశాం. ఆయన చాలా ఆసక్తి చూపించారు. స్క్రిప్ట్ కూడా రెడీ అయింది. కానీ అది టేకాఫ్ కాలేదు. తర్వాత ఓ మలయాళ సినిమా చేశా. అందుకే తెలుగులో తొమ్మిదేళ్ల గ్యాప్ వచ్చింది. త్వరలో ఓ వెబ్‌సిరీస్‌కి ప్లాన్ చేస్తున్నా. రెండు కాన్సెప్ట్‌లు రెడీగా ఉన్నాయి’ అన్నారు.