ఢిల్లీ నుంచి హైదరాబాద్​ దాకా..‘జామియా’కు మద్దతు

ఢిల్లీ నుంచి హైదరాబాద్​ దాకా..‘జామియా’కు మద్దతు
  • దేశమంతటా నిరసనలు
  • ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు
  • పలు వర్సిటీల్లో పరీక్షలు రద్దు

న్యూఢిల్లీ: ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ స్టూడెంట్స్​కు మద్దతుగా సోమవారం దేశవ్యాప్తంగా  ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు చెందిన స్టూడెంట్స్​  ఆందోళనకు దిగారు. సిటిజన్​ షిప్​చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేసిన జామియా స్టూడెంట్స్​పై  పోలీసుల లాఠీచార్జ్​ని  వ్యతిరేకించారు. ఢిల్లీ, హైదరాబాద్, లక్నో, ముంబై, బెంగళూరు, చెన్నై, కోలకతా లాంటి సిటీల్లోని స్టూడెంట్స్​ రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.జామియా క్యాంపస్​లో పోలీసులు టియర్​ గ్యాస్​ ప్రయోగించడాన్ని ప్రశ్నించారు. లైబ్రరీని ధ్వంసం చేయడం పట్ల పర్మిషన్​ లేకుండా క్యాంపస్​లోపలికి వెళ్లడాన్ని తప్పుపట్టారు. సోమవారంనాటి  టెన్షన్​ పరిస్థితులతో చాలా యూనివర్సిటీల్లో  పోలీసుల్ని  పెద్ద సంఖ్యలో దింపారు.  ఢిల్లీలోని పలు యూనివర్సిటీ స్టూడెంట్స్​ ఎగ్జామ్స్​ను బాయ్​కాట్​ చేశారు. నార్త్​ క్యాంపస్​ ఆర్ట్​ ఫ్యాకల్టీ  దగ్గర జామియా స్టూడెంట్స్​కు సపోర్ట్​గా  నిరసన తెలిపారు.

హైదరాబాద్

ఢిల్లీ పోలీసుల లాఠీచార్జిని ఖండిస్తూ సోమవారం గచ్చిబౌలిలోని మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం(మనూ)లో  విద్యార్థులు ఆందోళన చేశారు. విద్యార్థులు వర్సిటీ మెయిన్​ గేట్​ వద్దకు చేరుకొని బీజేపీ ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఢిల్లీ పోలీసులు క్షమాపణ చెప్పాలని స్టూడెంట్స్​ లీడర్స్​ డిమాండ్​ చేశారు.

లక్నో

నాడ్వా కాలేజీ స్టూడెంట్స్​ ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “ స్టూడెంట్స్​ క్యాంపస్​ లోపలి నుంచి మాపై  రాళ్లు విసిరారు.  నిరసనకారుల్ని అడ్డుకున్నాం.  క్యాంపస్​ నుంచి బయటకు రావడానికి  ఎవర్నీ అనుమతించలేదు”అని ఉత్తర ప్రదేశ్​ డీజీపీ ఓపీ సింగ్​ చెప్పారు.

ముంబై

సిటిజన్​షిప్​ చట్టాన్ని వ్యతిరేకిస్తూ టాటా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ సోషల్​ సైన్సెస్​ (టిస్) స్టూడెంట్స్  రోడ్లు పైకి వచ్చారు. ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  స్టాఫ్​ మెంబర్స్​ కూడా  ఆందోళనలో పాల్గొన్నారు.

ప్రధానికి  ఐఐఎం బెంగళూరు స్టూడెంట్స్​ లెటర్

జామియా, అలీగఢ్​ యూనివర్సిటీల్లో  పోలీసుల తీరును 100 మంది ఐఐఎం బెంగళూరు స్టూడెంట్స్​ ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకొచ్చారు.  “సిటిజన్​షిప్​ సవరణ చట్టనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న స్టూడెంట్స్​కు మేం  మద్దతు  చెబుతున్నాం.  పోలీసు చర్యల్ని ఖండిస్తున్నాం. అన్యాయమైన చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న ప్రజల  ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయొద్దని  ఈ ఇష్యూని మీ దృష్టికి తీసుకొస్తున్నాం”అని వాళ్లు ప్రధానికి లెటర్​ రాశారు. వ్యక్తిగత హోదాలోనే తాము ఈ లెటర్​ రాశామన్నారు.

ఐఐఎం అహ్మాదాబాద్​ స్టూడెంట్స్​ నిరసన

ఐఐఎం అహ్మాదాబాద్ కు చెందిన సుమారు 50 మంది స్టూడెంట్స్​  క్యాంపస్​ దగ్గర ఆందోళనచేశారు.   కొంతమంది స్టాఫ్​ మెంబర్లు కూడా దీనిలో పాల్గొన్నారు.  క్లాసికల్​ డ్యాన్సర్​ మల్లికా సారాభాయ్​ కూడా ఆందోళనలో పాల్గొన్నారు.

3 ఐఐటీల మద్దతు

దేశంలోనే ప్రతిష్టాత్మకమైన మూడు  ఐఐటీ లకు చెందిన కొందరు స్టూడెంట్‌ యూనియన్స్‌ కూడా  ఆందోళనలకు సపోర్ట్​  చేశాయి.  ఐఐటీ కాన్పూర్​, ఐఐటీ మద్రాస్​, ఐఐటీ ముంబై… జామియా స్టూడెంట్స్​కు సంఘీభావం తెలిపాయి. ఐఐటీ మద్రాస్​ స్టూడెంట్స్​ కొందరు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

తమిళనాడు

చెన్నైలోని లయోలా కాలేజ్​ స్టూడెంట్స్​  నిరసనలు తెలిపారు. చెన్నై, మధురై, కోయంబత్తూర్​ రైల్వేస్టేషన్ల దగ్గర ఎస్​ఎఫ్​ఐ కార్యకర్తలు ఆందోళన చేశారు.కోల్​కతాలోని జాదవ్​పూర్​ యూనివర్సిటీ స్టూడెంట్స్​ , వారణాసిలోని బెనారస్‌ ​హిందూ యూనివర్సిటీ  స్టూడెంట్స్​ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​ ( ఐఐఎస్​సీ) స్టూడెంట్స్​ కూడా ఆందోళనకు దిగారు. చండీగఢ్​,  పాట్నా , పాండిచ్చేరి, ముంబై యూనివర్సిటీలు కూడా జామియా స్టూడెంట్స్​కు సపోర్ట్​ తెలిపారు.

Citizenship Act: University students across country protest in solidarity with Jamia Millia, AMU