
సంగారెడ్డి టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అవలంభించే కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన కార్మికులతో కలిసి సంగారెడ్డి పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. లేబర్ కోడ్ ల రద్దును కోరుతూ ఈ నెల 20న జరిగే సమ్మె ఇతర కారణాల వల్ల జూలై 9 కి వాయిదా పడినట్లు తెలిపారు. పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్స్‌ను తీసుకురావడం దారుణమన్నారు.
కనీస వేతనం సంఘం పెట్టుకునే హక్కును కూడా తొలగించారన్నారు. 8 గంటల పని నుంచి 12 గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల ఐక్యత కోసం జూలై 9న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో మల్లేశ్, సాయిలు, బాగారెడ్డి, యాదగిరి, ప్రవీణ్, రాజేందర్ రెడ్డి, ప్రసాద్, మల్లారెడ్డి, రాందాస్, రమేశ్, కొండల్ రెడ్డి, ప్రవీణ్, వెంకటరెడ్డి, లక్ష్మణ్, విటల్, శోభా, యాదయ్య పాల్గొన్నారు.