మీకు గంజాయి.. మాకు బ్రౌన్‌‌‌‌ షుగర్‌‌‌‌‌‌‌‌

మీకు గంజాయి.. మాకు బ్రౌన్‌‌‌‌ షుగర్‌‌‌‌‌‌‌‌
  •  
  • మహిళలతో ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌, చైన్‌‌‌‌ సిస్టంలో ఎక్స్‌‌‌‌చేంజ్‌‌‌‌
  • నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్
  • 225 గ్రాముల హెరాయిన్‌‌‌‌, 28 కిలోల గంజాయి సీజ్

హైదరాబాద్‌‌‌‌/శంషాబాద్, వెలుగు: ముంబైకి గంజాయిని సప్లై చేస్తూ.. హైదరాబాద్​కు హెరాయిన్​ను తెచ్చి దందా చేస్తున్న బ్రౌన్‌‌‌‌ షుగర్ గ్యాంగ్​ను​  సిటీ పోలీసులు పట్టుకున్నారు. పాతబస్తీ అడ్డాగా సాగుతున్న గంజాయి, బ్రౌన్‌‌‌‌ షుగర్‌‌‌‌‌‌‌‌ ఎక్స్​చేంజ్​ దందాను వెస్ట్‌‌‌‌జోన్ టాస్క్‌‌‌‌ఫోర్స్ పోలీసులు బ్రేక్ చేశారు. శుక్రవారం నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి, 225 గ్రాముల హెరాయిన్, 28 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.23.61 లక్షలు ఉంటుందని అంచనా. ఈ గ్యాంగ్‌‌‌‌ వివరాలను టాస్క్‌‌‌‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌‌‌‌ రావుతో కలిసి సీపీ సీవీ ఆనంద్‌‌‌‌ వెల్లడించారు.

పాతబస్తీ కేంద్రంగా దందా..

బహదూర్‌‌‌‌పురాకు చెందిన షేక్‌‌‌‌ అబ్దుల్‌‌‌‌ అలామ్‌‌‌‌ ఖురేషీ అలియాస్‌‌‌‌ ఖాద్రి(40) దుబాయ్‌‌‌‌ కరెన్సీని అక్రమ రవాణా చేసేవాడు. 2018లో డైరెక్టరేట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌‌‌‌ కు పట్టుబడి జైలుకెళ్లాడు. విడుదలైన తర్వాత ఉస్మానియా బిస్కెట్ల వ్యాపారం చేశాడు. ఈ క్రమంలో ముంబైకి చెందిన చాంద్‌‌‌‌ షెహజదా సయ్యీద్‌‌‌‌(43)తో పరిచయమైంది. ఇద్దరు కలిసి గంజాయి, డ్రగ్స్ దందాకు ప్లాన్‌‌‌‌ చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన గంజాయి సప్లయర్‌‌‌‌‌‌‌‌ షేక్ ఖాసిం(34), చాంద్రాయణగుట్టకు చెందిన షాహిద్‌‌‌‌ కమల్​తో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో లభించే గంజాయిని ముంబైలో అమ్మేందుకు మీడియేటర్స్‌‌‌‌ను నియమించుకున్నారు.

విశాఖ ఏజెన్సీలో రమేష్‌‌‌‌ అనే వ్యక్తి నుంచి ముంబైకి రైలులో గంజాయిని తరలిస్తున్నారు. ఏపీకి చెందిన సరస్వతి, లావణ్య, లలిత, అప్పలమ్మ అనే మహిళలతో గంజాయి సప్లయ్ చేయించేవారు.ఇందుకు గాను మహిళలకు రూ.5వేలు ఇచ్చేవారు. ముంబైకి చెందిన అంతర్జాతీయ డ్రగ్‌‌‌‌ స్మగ్లర్‌‌‌‌ మహేష్‌‌‌‌ అలియాస్‌‌‌‌ రయీస్‌‌‌‌తో వ్యాపారం చేసే చాంద్‌‌‌‌, గంజాయిని వాళ్లకు ఇచ్చి బ్రౌన్‌‌‌‌ షుగర్‌‌‌‌ తీసుకునేవాడు. బ్రౌన్​ షుగర్​ గ్రాము రూ.1,100 చొప్పున ఖాద్రికి చాంద్​ అందించేవాడు. అతడు బ్రౌన్‌‌‌‌ షుగర్‌‌‌‌‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌ తీసుకొచ్చి షాహిద్‌‌‌‌ కమల్‌‌‌‌కు గ్రాము రూ.2,500 చొప్పున అమ్మేవాడు. కస్టమర్లకు రూ.7 వేల నుంచి రూ.9 వేలకు గ్రాము చొప్పున కమల్​ అమ్ముతు
న్నాడు. గత వారం నలుగురు మహిళలను కాచిగూడ రైల్వే స్టేషన్‌‌‌‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా చాంద్, ఖాద్రి, షేక్​ ఖాసిం, షాహిద్​ కమాల్​ను టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎయిర్ పోర్టులో 6.75 కిలోల హెరాయిన్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. శుక్రవారం సౌతాఫ్రికా నుంచి దోహా మీదుగా శంషాబాద్ చేరుకున్న ఓ మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గరున్న 5 హ్యాండ్ బ్యాగ్​లు, సూట్ కేస్ లోని ఫైల్స్ లో 6.75 కిలోల హెరాయిన్ పౌడర్​ను గుర్తించారు. దీని విలువ రూ.54 కోట్లు ఉంటుందని అంచనా. మహిళపై ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.