గతంలో కంటే ఎక్కువ వడ్లు కొన్నం

గతంలో కంటే ఎక్కువ వడ్లు కొన్నం
  • ఇప్పటికే 39.51 లక్షల టన్నులు సేకరించాం: డీఎస్​ చౌహాన్
  • గత సీజన్​లో 36.63 లక్షల టన్నులే కొన్నారు
  • రూ.8,690 కోట్లలో రూ.7,208 కోట్లు రైతులకు చెల్లించాం
  • నిరుడు ఈ టైమ్​కు రూ.7,53‌‌‌‌0 కోట్లలో రూ.3,168 కోట్లే జమ చేశారు
  • తడిసిన, మొలకెత్తిన ధాన్యం మద్దతు ధరకు సేకరిస్తున్నం.. సన్న బియ్యం కొనుగోళ్లలో అక్రమాలు జరగలేదు
  • నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని 
  • సివిల్​ సప్లైస్ కమిషనర్ హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు : ఈ సీజనల్​లో ఇప్పటికే గతేడాది కంటే ఎక్కువ వడ్లు కొనుగోలు చేశామని సివిల్​సప్లైస్ కమిషనర్ డీఎస్​ చౌహాన్​ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7,172 సెంటర్ల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 39.51 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇది గతంలో కంటే 2,88 లక్షల టన్నులు అధికమన్నారు. గురువారం సివిల్‌‌సప్లై భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు మొత్తం రూ.8,690 కోట్ల విలువైన ధాన్యం సేకరించగా అందులో 83 శాతం అంటే రూ.7,208 కోట్లు రైతులకు చెల్లించినట్లు తెలిపారు.

ధాన్యం అమ్మిన రెండు మూడు రోజుల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వివరించారు. గత సీజన్​లో 36.63 లక్షల టన్నులు మాత్రమే సేకరించారు. దీనికి సంబంధించిన మొత్తం రూ.7,530 కోట్లు కాగా ఈ టైమ్​ వరకు రైతులకు రూ.3,168 కోట్లు మాత్రమే చెల్లించినట్లు చెప్పారు. 

ఇది మొత్తం చెల్లింపుల్లో 42 శాతం మాత్రమే అని గుర్తు చేశారు. ఇంత ఎక్కువ కొనుగోళ్లు చేసినా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. నీతి, నిజాయితీతో పనిచేస్తున్న అధికారుల మనోభావాలు దెబ్బతీయడం సరికాదని అన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే చట్ట పరంగా ముందుకెళ్తామని చెప్పారు. అధికారులకు ఒక్క మిల్లరైనా డబ్బులు ఇచ్చినట్టు నిరూపించాలని అన్నారు. తానేంటో అందరికీ తెలుసునని, తమపై ఆరోపణల వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాం 

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పారదర్శంగా జరుగుతున్నదని చౌహాన్ తెలిపారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. తడిచిన ధాన్యాన్ని సైంటిఫిక్ మెథడ్ తో ప్రోక్యూర్ చేసి లాస్ ప్రభుత్వం భరించి నాణ్యమైన వడ్లు మిల్లర్లకు పంపిస్తున్నామని తెలిపారు. రైతులకు మాత్రం నష్టం రాకుండా చూస్తామని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి 30 లక్షల టన్నులు బాయిల్డ్ సేకరించేలా అనుమతి తీసుకున్నామని చెప్పారు.

అకాల వర్షాల నేపథ్యంలో అక్యూ వెదర్ యాప్​ను వాడి వాతావరణ వివరాలు సేకరించి ఆయా జిల్లాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశామని తెలిపారు. సెంటర్లలోనూ ధాన్యం తడవకుండా శాస్త్రీయ విధానాలు అమలు చేశామన్నారు. ప్రతీ సెంటర్లో టార్పాలిన్​లతో పాటు 3ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయడం ద్వారా తాలు పేరుతో వచ్చే కోతల సమస్యను పరిష్కరించామని తెలిపారు. 

డిఫాల్టర్ మిల్లర్లకు అడ్డుకట్ట వేశాం..

గతంలో ధాన్యం తీసుకుని మిల్లంగ్ చేయకుండా కోట్ల రూపాయలు ఎగ్గొట్టి డిఫాల్ట్ అయిన మిల్లర్లపై ఉక్కుపాదం మోపామని, వారికి ధాన్యం ఇవ్వట్లేదని కమిషనర్ తెలిపారు. డీఫాల్ట్‌‌‌‌‌‌‌‌ మిల్లర్లపై 43 క్రిమినల్ కేసులు పెట్టామని తెలిపారు. కొంతమంది మిల్లర్లు దేశం వదిలి వెళ్లారని అన్నారు. పూర్తి పారదర్శకతతో ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగిస్తున్నామని చెప్పారు. డిఫాల్టర్ల నుంచి  రూ.668 కోట్లు రికవరీ చేశామని.. మరో రూ.1,438కోట్ల రికవరీ పెండింగ్​లో ఉందన్నారు. సివిల్​ సప్లయ్స్ సంస్థకు రూ.58,623.05 కోట్ల అప్పులు ఉండగా నేడు రూ.52,276.78 కోట్లకు తగ్గించామని తెలిపారు. కేవలం మూడు నెలల్లో రూ.6,400 కోట్ల వరకు అప్పులు తీర్చి వడ్డీ భారాన్ని తగ్గించినట్లు చెప్పారు.

సన్న బియ్యం కొనుగోళ్లలో అక్రమాలు జరగలేదు.. 

సన్న బియ్యం కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరగలేదని.. గత విధానంలోనే కొనుగోలు చేశామే తప్ప కొత్తగా మార్పులు చేసిందేమి లేదని కమిషనర్ అన్నారు. తాము సన్న రకంతో పాటు అత్యంత సన్న రకాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అత్యంత సన్న రకాల ధర మార్కెట్లో సూపర్ ఫైన్ రకం కేజీకి రూ.62.21 ఉందని, సన్నాల ఫైన్ రైస్ ధర రూ.54.31గా ఉందని తెలిపారు. యావరేజీగా రూ.58.26 ఉందన్నారు.