
హైదరాబాద్, వెలుగు: రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొత్త కార్డుల కోసం మీ సేవలో ఎలాంటి అప్లికేషన్‌లు తీసుకోవడం లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కొత్తగా రేషన్ కార్డులు కావాలనుకునే వాళ్లు మీ సేవ కేంద్రాల ద్వారా అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించాలని పౌరసరఫరాల శాఖ.. ఎన్ఐసీని కోరుతూ లేఖ రాసింది. దీంతో కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకుంటున్నారని భారీగా జనం మీ సేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేయడానికి యత్నించారు. అయితే తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వారు చెప్పడంతో వాగ్వాదానికి దిగారు.
అదే సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా దరఖాస్తులు తీసుకోవడంపై ఎన్నికల కమిషన్(ఈసీ) ఆంక్షలు విధించిందనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై స్పందించిన ఈసీ తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొంది. రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియకు ఎలాంటి ఆటంకం లేదని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం ఇంత క్లారిటీగా చెప్పినప్పటికీ మీ సేవ కేంద్రాల్లో మాత్రం దరఖాస్తులు స్వీకరించలేదు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోయింది.
చివరకు గందరగోళానికి పౌరసరఫరాల శాఖ తెరదించింది. మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోరని స్పష్టం చేసింది. ఇప్పటికే గ్రామాల్లో జరిగిన గ్రామసభలు, ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగానే రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. తర్వాత రాని వాళ్లు ఉంటే మరోసారి గ్రామసభలు పెడతామని పేర్కొన్నారు. పాత రేషన్ కార్డుల్లో ఉన్న తప్పులు ఒప్పులు, చేర్పులు మార్పులు మాత్రం మీ సేవలో చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు డూప్లికేట్ అవ్వకుండా ఉండేందుకు మాత్రం మీ సేవ ద్వారా వాటిని స్ర్కూటినీ చేసి పంపించాలని చెప్పామన్నారు. అంతే తప్ప కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని అంటున్నారు. ప్రజాపాలన, గ్రామ సభల అప్లికేషన్ల డేటా ఎంట్రీపై వివరణాత్మక సూచనలు త్వరలో జారీ చేస్తామని, అందరూ డీసీఎస్‌వోలు ఈ ఆదేశాలను కింది స్థాయి సిబ్బందికి తెలపాలని వారికి వాట్సాప్ మెసేజ్‌లు అందాయి.