- సివిల్ సప్లయ్స్ శాఖ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ (ఎల్‌పీజీ) కొరత లేదని సివిల్ సప్లయ్స్శాఖ స్పష్టం చేసింది. ఆయిల్ రిఫైనరీల నుంచి స్థానిక డిపోల వరకు సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని, అన్ని జిల్లాల్లో ప్రజల అవసరాలకు తగినంత నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ఇటీవల కొన్ని పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న పొడవైన క్యూలు, తాత్కాలికంగా “నో స్టాక్” బోర్డులు వదంతుల ప్రభావమేనని అధికారులు తెలిపారు.
ప్రజలు భయాందోళనలకు గురై అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో ఇంధనం కొనుగోలు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో డీలర్లకు తాత్కాలిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఇది సరఫరాపై ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు. సందేహాలు, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1967ను సంప్రదించవచ్చని తెలిపింది.
