- పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్
కరీంనగర్, వెలుగు: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే 115 కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తైందని తెలిపారు. కేంద్రాల వద్ద వెంటనే లోడింగ్ చేపట్టి మిల్లులకు తరలించాలని, మిల్లుల్లో సత్వర అన్లోడింగ్ జరిగేలా చూడాలని ఆదేశించారు.
రైతులు ఆందోళన చెందవద్దు: సుడా చైర్మన్
కరీంనగర్ రూరల్ : వరి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడారు. వాహనాల కొరత, హమాలీల కొరత కారణంగా అక్కడక్కడ కొంత ఇబ్బంది ఏర్పడిందని పేర్కొన్నారు. అయినప్పటికీ రైతులకు ఎలాంటి నష్టం కలగనీయబోమన్నారు. కార్యక్రమంలో పెంచాల లక్ష్మణ్ రావు, ఉప సర్పంచ్ హన్మంత్ రావు, సెంటర్ ఇన్‌చార్జి అజయ్ పాల్గొన్నారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
కరీంనగర్, వెలుగు: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. జిల్లాలో తడిసిన 600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. 115 కొనుగోలు కేం ద్రాల్లో ప్రక్రియ పూర్తికావడంతో మూసివేసినట్లు తెలిపారు.
