పదెకరాలున్నా రేషన్ ఇస్తాం : అధికారులు

పదెకరాలున్నా రేషన్ ఇస్తాం : అధికారులు

పదెకరాలు అంతకంటే ఎక్కువ పొలం, భూమి ఉండి… రైతు బంధు పథకం ద్వారా లబ్ది పొందుతున్న రైతులకు మార్చి నెలనుంచి రేషన్ సరుకులు నిరాకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వెనక్కితీసుకుంది. రైతుల రేషన్ కార్డులు తొలగించడం లేదని… ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ కమిషనర్ అకున్ సభర్వాల్ స్పష్టంచేశారు. రైతుల రేషన్ కార్డులను తొలగించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని అన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇటీవల కాలంలో పౌర సరఫరాల శాఖ 3.50 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చిన సంగతిని వివరించింది.

పౌర సరఫరాల శాఖ చేస్తున్న సమగ్ర ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రైతు బంధు స్కీమ్ లో లబ్దిపొందుతున్న పెద్ద రైతులకు రేషన్ సరుకులు నిలిపివేయాలని అధికారులు ముందుగా ఓ నిర్ణయం తీసుకున్నారు. ఐతే… దీనిపై రైతులనుంచి వ్యతిరేకత రావడంతో… నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు సివిల్ సప్లై శాఖ అధికారులు.