సుప్రీం కోర్టు కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం

సుప్రీం కోర్టు కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం
  • ఉచిత హామీల కేసు త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ
  • యూపీ సీఎం యోగిపై నమోదైన కేసు కొట్టివేత
  • ఇవాళ ఐదు కీలక కేసులు విచారిస్తున్న సీజేఐ ఎన్వీ రమణ

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారిగా లైవ్ ప్రొసీడింగ్స్ జరిగాయి. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ రాజకీయ పార్టీల ఉచితాలపై వాదనలు విన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజమైన అధికారం ఓటర్లదేనని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. పార్టీలు, అభ్యర్థులను న్యాయ నిర్ణేతలుగా పరిగణిస్తారని చెప్పారు. ఈ కేసులో సంక్లిష్టతలను పరిశీలిస్తామన్నారు. కేసును ముగ్గురు జడ్జిల ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.

సుప్రీంకోర్టులో పదవీ విరమణ చేయబోతున్న సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ ఇవాళ ఐదు కీలక కేసుల్లో వాదనలు వింటున్నారు. 2007 గోరఖ్ పూర్ అల్లర్ల కేసులో వాదనలు విన్నారు. ఈ కేసులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను విచారించాల్సిన అవసరం లేదని గతంలో తీర్పు వచ్చింది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను జస్టిస్ ఎన్వీ రమణ విచారించారు. ద్వేషపూరిత ప్రసంగాల్లో యోగిని ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం లేదని, కేసును కొట్టివేస్టున్నట్లు సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ ప్రకటించారు. సాయంత్రం వరకు మరో మూడు కీలక కేసుల్లో వాదనలు వింటున్నారు. 

మరో వైపు ఇవాళ పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్ ఎన్వీ రమణకు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. సెరిమోనియల్ బెంచ్ ఈ ఫేర్ వెల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. గత ఏడాది ఏప్రిల్ 24న భారత సుప్రీంకోర్టు సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ ఎన్వీరమణ ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. కోర్టులు ప్రజలకు చేరువలో ఉండాలని.. అలాగే న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించాలని చెబుతూ వచ్చిన ఆయన దేశ అత్యున్నత న్యాయ స్థాన కార్యకలాపాలను ప్రజలు ప్రత్యక్షంగా తిలకించేలా లైవ్ ప్రసారాలకు చొరవ తీసుకున్నారు. తాను పదవీ విరమణ చేసే నాటికి సుప్రీం కోర్టు  విచారణల  ప్రత్యక్ష ప్రసారానికి ఇవాళ్టి నుంచే శ్రీకారం చుట్టారు.