
- పదవీ విరమణ వేడుకలో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా
- 52వ సీజేఐగా నేడు బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ గవాయ్
న్యూఢిల్లీ: తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ)గా బాధ్యతలు చేపట్టున్న జస్టిస్ బీఆర్ గవాయ్ సుప్రీంకోర్టు విలువలను కాపాడుతారని తాను ఖచ్చితంగా నమ్ముతున్నానని, ఆయన గొప్ప న్యాయమూర్తి అని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. తాను మున్ముందు ఎలాంటి అధికారిక పదవులు చేపట్టబోనని, అవసరమైతే న్యాయ వ్యవస్థకే ఏవైనా సేవలు అందిస్తానని చెప్పారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇది వీడ్కోలు కాదు.. ఒక దశ నుంచి మరో దశలోకి ప్రారంభం మాత్రమే. ఇన్నాళ్లూ ఎన్నో నేర్చుకున్నాను. సహచర జడ్జిలు, న్యాయవాదులు ఎంతో సహకారం అందించారు. వారందరికీ కృతజ్ఞతలు. నేను ఎన్నో జ్ఞాపకాలను వెంట తీసుకెళ్తున్నాను. అవి కలకాలం పదిలంగా ఉంటాయి” అని భావోద్వేగానికి గురయ్యారు.
కొత్త సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బీఆర్ గవాయ్.. ప్రాథమిక హక్కులను కాపాడుతారని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారని పేర్కొన్నారు. జస్టిస్ గవాయ్ గొప్ప, తాను ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చామని జస్టిస్ సంజీవ్ ఖన్నా గుర్తుచేసుకున్నారు. కాగా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలో తానెప్పుడూ కోపాన్ని చూడలేదని, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా నిరుడు నవంబర్ 11న జస్టిస్ ఖన్నా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఆరునెలలపాటు ఆ పదవిలో కొనసాగారు.