భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్.. !

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్.. !

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ సిఫార్సు చేశారు. ఈ మేరకు జస్టిస్ రమణ.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ఆమోద పత్రంపై సంతకం చేస్తే భారత సుప్రీంకోర్టు 49వ సీజేగా లలిత్ పదవీ పగ్గాలు చేపడతారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆగష్టు 26న పదవీ విరమణ చేయనున్నారు. ఈ మేరకు తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరును సిఫారసు చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం సీజేఐ ఎన్వీ రమణకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. 

దేశంలో సంచలనం సృష్టించిన అనేక కీలక కేసుల్లో తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ యు.యు.లలిత్ ఉన్నారు. 1957 నవంబర్ 9 న జన్మించిన లలిత్... జూన్ 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1985 వరకు ముంబయి హైకోర్టులో లలిత్ ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత జనవరి 1986నుంచి తన ప్రాక్టీసును సుప్రీంకోర్టుకు మార్చారు. 2014 ఆగస్టు 13న ఆయన  సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.  జస్టిస్ లలిత్ భారత ప్రధాన నాయమూర్తిగా నియమితులైతే.. బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు బెంచ్‌కి ఎలివేషన్ పొందిన రెండోవ సీజేఐ అవుతారు. ఇక, 1971 జనవరిలో 13వ CJIగా నియమితులైన జస్టిస్ ఎస్‌ఎం సిక్రీ ఈ కోవలో మొదటివారు. ఇక, జస్టిస్ లలిత్ తండ్రి జస్టిస్ యూఆర్ లలిత్ సీనియర్ న్యాయవాదిగా, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అంతేకాదు ట్రిపుల్ తలాక్ కు సంబంధించిన విషయంలోను, కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ హక్కుకు సంబంధించిన విషయంలోనూ జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.