తెలంగాణ సీఎస్ పై సీజేఐ ఆగ్రహం

తెలంగాణ సీఎస్ పై సీజేఐ ఆగ్రహం
  • 50 శాతం కేసుల్లో సర్కారే పేచీకోరు
  • కొన్ని రాష్ట్రాల్లో ధిక్కరణ కేసులు బాగా పెరుగుతున్నాయి
  • సీఎం, హైకోర్టు సీజే తీసుకున్న నిర్ణయాలను
  • అమలు చేయడం లేదంటూ  తెలంగాణ సీఎస్​పై ఆగ్రహం
  • న్యాయ భాష అందరికీ అర్థమయ్యేలా ఉండాలన్న ప్రధాని
  • ఢిల్లీలో హైకోర్టు సీజేలు, సీఎంల సదస్సు

న్యూఢిల్లీ, వెలుగు: న్యాయ వ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ అన్నారు. స్థానిక సమస్యలను స్థానిక అధికారులు పరిష్కరిస్తే కోర్టులపై భారం పడదని పేర్కొన్నారు. ఆ భారాన్ని తగ్గించాల్సిన బాధ్యత అధికారులు, ప్రభుత్వాలపై ఉందని సూచించారు. ‘‘రైతు ఫిర్యాదుపై తహసీల్దార్ చర్యలు తీసుకుంటే, రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనే ఉండదు. భూ సేకరణ విషయంలో రెవెన్యూ అధికారులు న్యాయ ప్రక్రియతో ముందుకు వెళ్తే.. ప్రజలు కోర్టుకు రారు’’ అని అన్నారు. కానీ, అలా జరగకపోవడం వల్ల కోర్టుల్లో కేసులు పేరుకుపోతున్నాయని, ఇలాంటి కేసులే 66 శాతం ఉన్నాయని చెప్పారు. అధికారులు ఎందుకు విఫలమవుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అధికారులు సరిగ్గా పనిచేస్తే చాలా కేసులు కోర్టుల దాకా రావని తెలిపారు. దాదాపు 50 శాతం కేసుల్లో ప్రభుత్వమే పేచీకోరుగా ఉంటున్నదని, జాప్యాలన్నింటికీ కోర్టే కారణం కాదని అన్నారు.  అక్రమ కస్టడీ చిత్రహింసలు ఆగిపోస్తే జనం కోర్టుకు రావాల్సిన అవసరం ఉండదన్నారు. కోర్టుల్లో స్థానిక భాషలను ప్రవేశపెట్టాలనే డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందని, దానిపై పునఃసమీక్షించాల్సిన సమయం వచ్చిందన్నారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో  హైకోర్టు జడ్జిలు, సీఎంల ఉమ్మడి న్యాయ సదస్సును ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. సదస్సులో సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ, వివిధ రాష్ట్రాల సీఎంలు, 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల న్యాయశాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.  కేసుల పరిష్కారానికి మరింత సిబ్బంది కావాలని, కోర్టుల్లో మాన వనరుల కొరత తీరితే కేసుల భారం తగ్గుతుందని సీజేఐ ఎన్వీ రమణ చెప్పారు.

ధిక్కరణ కేసులు పెరుగుతున్నయ్​

కొన్ని ప్రభుత్వాలు కోర్టుల ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయని సీజేఐ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి అంత ఆరోగ్యకరం కాదన్నారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దుర్వినియోగం అవుతున్నాయని,  ప్రజా సేవకు, రాజకీయ ప్రత్యర్థికి ఆటంకం కలిగించే సాధనంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలి

న్యాయమూర్తులు లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలని సీజేఐ సూచించారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు రాజ్యాంగం వేర్వేరు అధికారాలను కల్పించిందని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య బలోపేతానికి, సామరస్యంగా కార్యకలాపాలు సాగేందుకు ఇది దోహద పడుతుందన్నారు. విధాన రూపకల్పన తమ డొమైన్ కాదని, కానీ పౌరుడు ఫిర్యాదుతో కోర్టుకు వస్తే కోర్టు నో చెప్పదని తెలిపారు. ప్రస్తుతం 10 లక్షల జనాభాకు 20 మంది జడ్జిలు ఉండటం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. న్యాయవ్యవస్థకు సహకరించాలని సీఎంలందరినీ కోరుతున్నట్లు తెలిపారు. 

హాజరైంది వీరే...

ఏపీ సీఎం జగన్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, చత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తదితరులు సదస్సుకు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రికి బదులు రాష్ట్ర న్యాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్ర సీఎస్ పై సీజేఐ ఆగ్రహం

తెలంగాణలోని న్యాయ వ్యవస్థ సమస్యల పరిష్కారంపై సీఎం, హైకోర్టు సీజేలు తీసుకున్న పలు నిర్ణయాలను సీఎస్ సోమేశ్ కుమార్  అమలు చేయడం లేదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన న్యాయపర అంశాలను సదస్సులో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్​ చంద్రశర్మ ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎస్   తీరుపై సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్, న్యాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, సీఎస్ తనతో భేటీ అయినప్పుడు న్యాయ వ్యవస్థకు సంబంధించిన పలు అంశాలపై చర్చించామని గుర్తుచేశారు. ఇందులో భాగంగా తీసుకున్న పలు నిర్ణయాలపై పాజిటివ్ గా స్పందించిన కేసీఆర్, రెండు రోజుల్లో సంబంధిత జీవోలు రిలీజ్ చేయాలని సీఎస్ ను ఆదేశించారని, కానీ, ఇంతవరకు సీఎస్ జీవోలు రిలీజ్ చేయలేదన్నారు. తామేమీ వ్యక్తిగత పనుల కోసం అడగడం లేదని, న్యాయవ్యవస్థ బలోపేతం కోసమే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కోర్టులో దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టుల్లో ఒక న్యాయవాది లోపలకు వెళ్లి వెనక్కి వస్తే తప్ప, మరో వ్యక్తి లోనికి వెళ్లే పరిస్థితి లేదన్నారు. స్పందించిన రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. ఈ అంశాలను తానే పరిశీలిస్తానని చెప్పారు. కాగా.. సీఎం, రాష్ట్ర హైకోర్టు సీజేలతో పాటూ సీఎస్ లను రాష్ట్ర జ్యుడిషియల్ అథారిటీలో చేర్చాలని సదస్సులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచించారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ.. ‘‘తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ తీరును మీరే విన్నారుగా. సీఎస్ లు  మీటింగ్స్ అటెండ్ కారు. ఒకవేళ అయినా, తీసుకున్న కీలక నిర్ణయాలను అమలు చేయరు’’ అని  అన్నారు. 

కోర్టుల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలి: ప్రధాని 

సామాన్యులకు అర్థమయ్యేలా న్యాయ భాషను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కోర్టుల్లో న్యాయ వ్యవహారాలన్నీ ఇంగ్లిష్ లోనే జరుగుతున్నాయని, స్థానిక భాషలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇది సాధారణ పౌరులకు న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతుందని చెప్పారు. ఉమ్మడి న్యాయ సదస్సులో ప్రధాని మాట్లాడుతూ.. దేశంలో న్యాయ వ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కోర్టుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు సహకరిస్తామని  హామీ ఇచ్చారు. న్యాయ విద్యను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 3.5 లక్షల మంది విచారణ ఎదుర్కొంటూ జైళ్లలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.