ట్రంప్ వాదనను తోసిపుచ్చిన భారత్.. అంటే అమెరికా ప్రెసిడెంట్ వ్యాఖ్యలన్నీ ఉత్తవేనా..!

ట్రంప్ వాదనను తోసిపుచ్చిన భారత్.. అంటే అమెరికా ప్రెసిడెంట్ వ్యాఖ్యలన్నీ ఉత్తవేనా..!

న్యూఢిల్లీ: రెండు దేశాలతో వాణిజ్యం నిలిపివేస్తానని బెదిరించి భారత్‌, పాకిస్థాన్‌ను కాల్పుల విరమణకు ఒప్పించానని..  నా జోక్యం వల్లే ఇరు దేశాల మధ్య అణు యుద్ధం తప్పిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తోసిపుపుచ్చింది. భారత్, పాక్ మధ్య కాల్పుల విరణమణకు సంబంధించి అమెరికా జరిపిన చర్చల సమయంలో అసలు వాణిజ్య అంశమే చర్చించలేదని భారత్ స్పష్టం చేసింది. ఆపరేషన్ సిందూర్ గురించి మంగళవారం (మే 13) భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ బ్రీఫింగ్ ఇచ్చింది. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మీడియాతో మాట్లాడుతూ..

పీవోకేకు సంబంధించిన ఏవైనా సమస్యలను భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలనేది మా జాతీయ వైఖరి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన పీవోకేను వదిలిపెట్టడమే మిగిలి ఉందన్నారు. పాకిస్తాన్ నుంచే మొదట కాల్పుల విరమణ కోసం అభ్యర్థన వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. భారతీయ ఆయుధాల బలం వల్లే పాకిస్తాన్‎కు విదేశీ శక్తులు మద్దతు ఇవ్వడం మానేశాయని తెలిపారు.

భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు అణు యుద్ధానికి దారి తీశాయన్న ఆందోళనలను ఆయన ఖండించారు. సైనిక చర్య పూర్తిగా సంప్రదాయ పద్దతిలోనే జరిగిందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ న్యూక్లియర్ పాలసీపై పూర్తి అధికారులు ఉండే పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అథారిటీ మే 10న సమావేశం అవుతుందని కొన్ని నివేదికలు వచ్చాయి, కానీ తరువాత వారు దానిని తిరస్కరించారని గుర్తు చేశారు. 

పాక్ అణు బాంబు బెదిరింపులకు లొంగబోమని.. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని భారత దేశ వైఖరిని రణ్‎దీర్ జైశ్వాల్ మరోసారి పునరుద్ఘాటించారు. పాకిస్తాన్ వెలుపల పనిచేస్తున్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మేము లక్ష్యంగా చేసుకుంటామని.. ఈ అంశంలో పాకిస్తాన్ సైన్యం తలదూర్చకుంటే ఎటువంటి సమస్య ఉండదని స్పష్టం చేశారు.

 కానీ ఒకవేళ పాక్ ఆర్మీ మాపై కాల్పులు జరిపితే మాత్రం మేము తగిన విధంగా బదులిస్తామని తేల్చి చెప్పారు. భారతే బయపడి కాల్పుల విరమణ కోసం అభ్యర్థించిందని.. భారత్ లోని పలు వైమానిక స్థావరాలను ధ్వంసం చేసిందని పాక్ లేని గొప్పలు చెప్పుకుంటుందని.. అయినా లేని విజయాలను సాధించామని చెప్పుకోవడం ఆ దేశానికి పాత అలవాటేనని ఎద్దేవా చేశారు.