ఎస్ఎన్​డీపీ ఫేజ్-2పై రెండు వారాల్లో క్లారిటీ

ఎస్ఎన్​డీపీ ఫేజ్-2పై రెండు వారాల్లో క్లారిటీ
  • త్వరలో పనులపై చర్చిద్దామని మంత్రి కేటీఆర్ సూచన
  • ఇప్పటికే 2వేల కోట్లతో 80 పనులకు ప్రపోజల్స్
  • సర్కార్ ​అనుమతి కోసం ఎదురుచూస్తున్న బల్దియా అధికారులు 

హైదరాబాద్, వెలుగు: స్ట్రాటజిక్ నాలా డెవలప్​మెంట్ ప్రోగ్రాం(ఎస్ఎన్​డీపీ) సెకండ్ ఫేజ్ పనులపై ఈ నెలలో క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. మూడు రోజుల కిందట జరిగిన ఓ సమావేశంలో దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రెండు వారాల్లో సెకండ్ ఫేజ్ పనులపై చర్చించి పనులు స్టార్ట్ ​చేద్దామని అధికారులకు సూచించారు. రెండేళ్ల కిందట గ్రేటర్ పరిధిలో వరదల నివారణకు ఎస్ఎన్​డీపీ ఫస్ట్ ఫేజ్ కింద రూ.737.45 కోట్లతో 37 నాలాల అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో10 పనులు నేటికీ కొనసాగుతున్నాయి. ఫస్ట్​ఫేజ్​పనులు ప్రారంభించిన కొన్నాళ్లకే రూ.2 వేల కోట్లతో సెకండ్​ఫేజ్​కింద దాదాపు 80 నాలాల పనులు చేపట్టాలని బల్దియా అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపారు. అప్పటి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా జరిగిన సమావేశంలో ఫస్ట్ ఫేజ్ పనుల వివరాలను మంత్రి కేటీఆర్ ​అడిగి తెలుసుకున్నారు. సెకండ్ ​ఫేజ్ ​స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.   

నిధుల్లేకుండా పనులు అయితయా?

ఎస్ఎన్​డీపీ ఫేజ్–1 కోసం జీహెచ్ఎంసీ రూ.700 కోట్లు అప్పు తీసుకుంది. ఫేజ్–2 పనుల కోసం మరోసారి అప్పు కావాలని బ్యాంకుల చుట్టూ  తిరుగుతోంది. ఇందులో భాగంగా ఐఎఫ్​సీ బ్యాంకును ఆశ్రయించినట్లు తెలిసింది. కాస్త ఆలస్యమైనా సరే తక్కువ వడ్డీకి లోన్ తీసుకోవాలని బల్దియా ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. అయితే ఇంతవరకు ఎక్కడా నయాపైసా 
పుట్టలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు. తాజాగా మంత్రి కేటీఆర్ ఎస్ఎన్ డీపీ పనులపై ఆరా తీయడంతో ఇప్పుడేం చేస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. జీహెచ్ఎంసీ కొన్నేండ్లుగా ఇప్పటి వరకు వివిధ పనుల కోసం రూ.రూ.5,275 కోట్ల అప్పులు చేసింది. ఈ మొత్తానికి డైలీ రూ.కోటి20 లక్షల వడ్డీ చెల్లిస్తోంది. 

ఎన్నికల తర్వాతనే..

మూడేండ్లుగా భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి వందలాది కాలనీలు నీట మునగి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ నాలాల పనులను త్వరగా పూర్తిచేయడం లేదు. ఈ ఏడాది ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తిచేసినా, సెకండ్ ఫేజ్ మొదలవడం దాదాపు కష్టమే. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి, లో న్ ​శాంక్షన్ ​అయినా ఇప్పటికిప్పుడు పనులు మొదలుపెట్టడం కష్టమని అధికారులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చేపట్టే అవకాశం కనిపిస్తోంది. కేవలం ఎన్నికల ప్రచారంలో భాగంగా సెకండ్ ఫేజ్​కు అనుమతి ఇచ్చామని చెప్పేందుకే ఇప్పుడు సెకండ్​ ఫేజ్​ గురించి ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది.