V6 News

సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో పంచాతీయ ఎన్నికల పోరు హత్యకు దారి తీసింది. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం (డిసెంబర్ 9) కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివాదం చిలికిచిలికి గాలివానలా మారి ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య మరణించాడు.

మరో ముగ్గురు బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరవర్గాలను చెదరగొట్టారు. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియాకు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని హైదరాబాద్‎కు తరలించారు. మల్లయ్య మృతితో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.