
- బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నం
- ఇందూరులోనే డీసీసీ ప్రెసిడెంట్ మోహన్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
నిజామాబాద్/బాల్కొండ, వెలుగు : కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల విమర్శలు, సవాళ్లతో వేల్పూరులో గురువారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితి కంట్రోల్ తప్పేలా ఉండడంతో సీపీ సాయిచైతన్య 144 సెక్షన్ విధించారు. వివరాల్లోకి వెళ్తే... గల్ఫ్ బాధితులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మూడు రోజుల నుంచి విమర్శలు చేస్తున్నారు. స్పందంచిన డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్‌రెడ్డి.. కాంగ్రెస్ సర్కార్ ఎన్‌ఆర్‌ఐ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు గల్ఫ్‌లో చనిపోయిన వారి ఫ్యామిలీలకు ఆర్థికసాయం కూడా ఇస్తోందని చెప్పారు.
కాంగ్రెస్ చేపడుతున్న స్కీమ్‌లను వివరించేందుకు ఎమ్మెల్యే స్వగ్రామమైన వేల్పూర్‌కు వస్తానని.. ఎమ్మెల్యే సైతం రావాలని సవాల్ చేశారు. దీంతో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండడంతో నిజామాబాద్‌లోని మానాల మోహన్‌రెడ్డి ఇంటి ఎదుట పోలీసులను మోహరించి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. మోహన్‌రెడ్డి పిలుపుతో వేల్పూర్‌కు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఇంటి వైపు వెళ్లారు.
వీరిలో దేవేందర్‌రెడ్డి అనే యువకుడు ఎమ్మెల్యే ఇంటి గేట్ దూకి లోపల వీడియో తీస్తుండగా.. గమనించిన ఎమ్మెల్యే మద్దతుదారులు అతడిని పట్టుకొని దాడి చేశారు. అనంతరం ఇరు పార్టీల లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే అబద్ధాలతో బురదచల్లడం మానుకోవాలని మానాల మోహన్‌రెడ్డి సూచించారు. మరో వైపు కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌కుమార్‌ను మోర్తాడ్‌లోనే హౌస్ అరెస్ట్ చేశారు.