లోక్​సభలో మన ఎంపీల మధ్య లొల్లి

లోక్​సభలో మన ఎంపీల మధ్య లొల్లి

ఎంపీలు సంజయ్, నామా వాగ్వాదం

న్యూఢిల్లీ, వెలుగు:  లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ కుమార్, టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు మధ్య  వాగ్వాదం జరిగింది. ఈ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తోందని నామా నాగేశ్వరావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్  మైనార్టీల ప్రయోజనాల కోసం కట్టుబడి ఉందన్నారు. తమ పార్టీ లౌకికవాద పార్టీ అని, రాజ్యాంగ స్ఫూర్తికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కలుగజేసుకున్న ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. హిందువుల ప్రయోజనాలు మాత్రం టీఆర్ఎస్ కు పట్టవా? అని నిలదీశారు. హిందువులు ప్రజలు కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న విమోచన దినం ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. దీంతో వాదులాట వద్దులే అన్నట్టుగా హోం మంత్రి అమిత్ షా సంకేతం ఇవ్వడంతో బండి సంజయ్ కూర్చున్నారు. అనంతరం నామా కొనసాగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం లోక్​సభలో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు మైనారిటీలకు పూర్తి వ్యతిరేకంగా ఉందన్నారు. అందుకే తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

Clash between MP Bandi Sanjay Kumar and Nama Nageshwara Rao at Lok Sabha