
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ విస్తృతస్థాయి సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కాంగ్రెస్ సీనియర్లకు కాకుండా బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు ఆందోళనకు దిగారు. అసమ్మతి వర్గం, సామేల్ వర్గం పోటాపోటీగా నినాదాలు చేయడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది.
బుధవారం సూర్యాపేటలో కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, పరిశీలకులు, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, నాయకులు శత్రురావు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, సూర్యాపేట అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ హాజరయ్యారు. మందుల సామేల్ మాట్లాడుతున్న టైంలో అర్వపల్లికి చెందిన నాయకులు అడ్డుకున్నారు. తుంగతుర్తిలో కాంగ్రెస్‌ను గెలిపించడం కోసం సీనియర్లంతా శ్రమించామని, సామేల్ ఎమ్మెల్యేగా గెలిచాక తమను కాదని, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు.
ఇదేమని ప్రశ్నిస్తే తమపైనే కేసులు పెట్టిస్తున్నారని, సంక్షేమ పథకాల్లో అసలైన కార్యకర్తలకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. కార్యకర్తల సమస్యలను తెలుసుకొని ఎమ్మెల్యే సామేల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సామేల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో, సామేల్ వర్గం సైతం పోటీగా నినాదాలు చేశారు. దీంతో సమావేశంలో గందరగోళం ఏర్పడడంతో సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి కల్పించుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశాలు కల్పిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
అనంతరం ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యం కల్పించి మార్కెట్ కమిటీ చైర్మన్లుగా నియమించినట్లు తెలిపారు. తాను స్వార్ధం కోసం పని చేయడం లేదని, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఇద్దరు మంత్రుల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేసేందుకు ముందుకు రావాలని
పిలుపునిచ్చారు.