ఇబ్రహీంపట్నం రణరంగం : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాళ్ల దాడి

ఇబ్రహీంపట్నం రణరంగం : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాళ్ల దాడి

హైదరాబాద్ సిటీ శివార్లలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రణరంగం అయ్యింది. నవంబర్ 9వ తేదీ మధ్యాహ్నం నామినేషన్లు వేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు రెడీ కావటం ఉద్రిక్తతకు దారి తీసింది. నామినేషన్ వేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఒకేసారి బయలుదేరారు. రెండు పార్టీలు పోటాపోటీగా ర్యాలీగా బయలుదేరటంలో వేలాది మందితో ఇబ్రహీంపట్నం రోడ్లు కిక్కిరిశాయి..

ఇబ్రహీంపట్నం సెంటర్ దగ్గర బీఆర్ఎస్, కాంగ్రెస్ ర్యాలీలు ఎదురెదురు పడ్డాయి. ఒకరికి ఒకరు పోటాపోటీగా నినాదాలు చేయటంతో ఉద్రిక్తత ఏర్పడింది. రెండు వర్గాలు జెండా కర్రలతో కొట్లాటకు దిగాయి. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. అదుపుతప్పిన వేలాది మంది కార్యకర్తలు రోడ్లపై ఉన్న బస్సులు, లారీల అద్దాలు ధ్వంసం చేశారు. బీభత్సం చేశారు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. 20 నిమిషాలపాటు ఇబ్రహీంపట్నం టౌన్ రణరంగాన్ని తలపించింది. పోలీసులు పెద్ద సంఖ్యలో ఆందోళనకారులను చెదరగొట్టారు. లాఠీలకు పని చెప్పటంతో సిట్యువేషన్ అదుపులోకి వచ్చింది. 

ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మల్ రెడ్డి రంగారెడ్డి పోటీలో ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులు ఒకేరోజు.. ఒకేసారి నామినేషన్ దాఖలు చేయటానికి.. పెద్ద ఎత్తున కార్యకర్తలతో తరలిరావటంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి అంతా కూల్ అయ్యిందని.. కంట్రోల్ అయ్యిందని చెబుతున్నారు పోలీసులు.