యువకులకు, మహిళా ఎస్ఐకి మధ్య ఘర్షణ

యువకులకు, మహిళా ఎస్ఐకి మధ్య ఘర్షణ
  • చెయ్యి పట్టుకున్న యువకులు 
  • నా కొడకల్లారా అంటూ అధికారి ఆగ్రహం
  • ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ఘటన  

నేలకొండపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో నిమజ్జనం సందర్భంగా కొందరు యువకులకు, మహిళా ఎస్ఐకి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీన్ని అక్కడున్నవారు వీడియో తీసి సోషల్​మీడియాలో పెట్టడంతో వివాదం మరింత ముదిరింది. స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఉత్సవ కమిటీ వారు నిమజ్జన ఊరేగింపు నిర్వహిస్తున్నారు. కొండపల్లి డౌన్​సెంటర్ లో అనుమతులు లేకపోయినా డీజేలతో డ్యాన్సులు చేస్తుండగా ఎస్ఐ స్రవంతి వచ్చారు. నిమజ్జనం త్వరగా పూర్తి చేయాలని, డీజేకు పర్మిషన్ లేదని చెప్పినా వినిపించుకోకుండా గొడవకు దిగారు. ఈ క్రమంలో ఎస్సై ‘తాగి నా కొడకల్లారా ఏం బీహేవ్ ​చేస్తున్నరు’అంటూ  వారిపైకి దూసుకెళ్లారు. ఒకరు ఆమె చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నించగా ‘కొడకల్లారా మామూలుగా ఉండదు చెప్తున్నా’ అంటూ అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. దీన్నంతా అక్కడున్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు. కాగా ఎస్సై ‘మాదిగ నా కొడకల్లారా’ అని అన్నారని ప్రచారం జరగడంతో  కొందరు కుల సంఘాల లీడర్లు పీఎస్​ ముందు ఆందోళనకు యత్నించారు. ఘటనతో సంబంధం ఉన్న యువకులు వారి దగ్గరకు వచ్చి జరిగిన దాంట్లో తమ తప్పు కూడా ఉందని, గుర్తు తెలియని కొంతమంది ఎస్ఐ చేయి పట్టుకోవడంతోనే ఇదంతా జరిగిందని సర్ధి చెప్పారు. ఇందులో కులాలకు సంబంధం లేదని సర్ధి చెప్పడంతో వెళ్లిపోయారు.   కాగా, మహిళా ఎస్​ఐతో దురుసుగా ప్రవర్తించిన 10 మంది యువకులపై కేసు నమోదు చేసినట్టు ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి తెలిపారు.  యువకులను మందలించినందుకు తిడుతూ దాడి చేశారని, దీంతో ఎస్సై చేతికి గాయమైందన్నారు.  

ఏ కులాన్ని దూషించలేదు : ఎస్​ఐ స్రవంతి

డీజేలు పెట్టడంతో ఇబ్బంది అవుతోందని 100 కు కాల్ రావడంతో తాను వెళ్లానని ఎస్​ఐ స్రవంతి చెప్పారు. అక్కడున్న వారికి సర్ధి చెప్పే ప్రయత్నం చేయగా మద్యం మత్తులో ఉన్న కొంతమంది తన చెయ్యి పట్టుకోవడంతో పాటు  అసభ్యకరంగా ప్రవర్తించారన్నారు. ఆ క్రమంలోనే ‘తాగి నా కొడకల్లారా ఏం బిహేవ్ చేస్తున్నరు’ అని మాత్రమే అన్నానని, ఏ కులాన్ని దూషించలేదన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.