పెండ్లిల పనీర్ పెట్టలేదని పొట్టు పొట్టు కొట్టుకున్రు

పెండ్లిల పనీర్ పెట్టలేదని పొట్టు పొట్టు కొట్టుకున్రు

కట్నం కోసమో, మర్యాద తగ్గిందనో పెళ్లిళ్లలో గొడవలు జరగడం సాధారణం. కానీ పెండ్లి కొడుకు మేనమామకు పనీర్ వడ్డించలేదని వధూవరుల బంధువులు పొట్టుపొట్టుకొట్టుకున్నారు. యూపీ భాగ్పత్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 

గౌరానా గ్రామానికి చెందిన యువకునికి భాగ్ పత్ కు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. బుధవారం పెండ్లి కొడుకు తరఫు వారు భాగ్ పత్ సిటీలోని మండపానికి తరలివచ్చారు. అయితే వివాహ విందులో వరుడి మేనమామకు పనీర్ వడ్డించకపోవడం, డీజే తాము అడిగిన పాట పెట్టకపోవడంతో గొడవ మొదలైంది. ఈ విషయంపై పెండ్లి కొడుకు తరఫు వారు పెళ్లి కూతురు తరఫు వారిని ప్రశ్నించగా ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగింది. చివరకు బెల్టులు, కర్రలతో కొట్టుకునే స్థాయికి చేరింది. విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరుపక్షాల వారికి సర్థి చెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకపోవడంతో లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు. గొడవకు కారణంగా భావిస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వధూవరుల తరఫు బంధువుల అభ్యర్థన మేరకు వారిని విడిచిపెట్టారు.