- అనుమానాలున్నాయని కుటుంబసభ్యులు, బీఆర్‌ఎస్ లీడర్ల ఆందోళన
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఘటన
ఎల్లారెడ్డి, వెలుగు : బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ స్టూడెంట్ బుధవారం ఉదయం చనిపోయింది. స్టూడెంట్ మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... నస్రుల్లాబాద్ మండలం హాజిపూర్ గ్రామానికి చెందిన శ్రావణి (13) ఎల్లారెడ్డిలోని బీసీ హాస్టల్‌లో ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతోంది. బుధవారం తెల్లవారుజామున కొందరు స్టూడెంట్లు నిద్ర లేచి బాత్‌రూమ్‌ల వైపు వెళ్లేసరికి శ్రావణి కిందపడి కనిపించింది. దీంతో స్టూడెంట్లు సిబ్బందికి చెప్పారు. హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు కలిసి శ్రావణిని స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు శ్రావణి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే శ్రావణి హార్ట్‌స్ట్రోక్‌తో చనిపోయిందా ? లేక ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయా ? అనేది పోస్ట్‌మార్టంలో తేలుతుందని ఆఫీసర్లు చెప్పారు. శ్రావణి తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆందోళనకు దిగిన కుటుంబసభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు
శ్రావణి మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులకు హాస్పిటల్‌కు చేరుకున్నారు. శ్రావణి మృతిపై అనుమానాలు ఉన్నాయని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు హాస్పిటల్ వద్దకు చేరుకొని కుటుంబసభ్యులకు మద్దతుగా రాస్తారోకో చేపట్టారు. ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగానే శ్రావణి చనిపోయిందని, ఆమె మృతిపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి సురేందర్‌తో పాటు బీఆర్‌ఎస్ శ్రేణులను అరెస్ట్ చేసి భిక్కరూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

