వచ్చే నెల ఫస్ట్‌ నుంచి టీవీలో క్లాసులు

వచ్చే నెల ఫస్ట్‌ నుంచి టీవీలో క్లాసులు

టీవీ, టీ శాట్ ద్వారా స్టూడెంట్స్‌ కు పాఠాలు

27 నుంచి బడులకు టీచర్లు .. సర్కారు ఉత్తర్వులు

ట్రాన్స్‌ పోర్ట్ లేకుండా ఎట్ల పోవాలంటున్న టీచర్లు

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో డిజిటల్ క్లాసులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ నెల 27 నుంచి టీచర్లు బడులకు రావాలంది. డిజిటల్ తరగతులు స్టార్టవుతున్నందున ఆల్టర్నెట్ క్యాలెండర్ రెడీ చేసి పూర్తి స్థాయి గైడ్‌ లైన్స్ రిలీజ్ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్‌ సీఈఆర్టీ అధికారులను స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రారాంచంద్రన్ సోమవారం ఆదేశించారు. తొలుత 20నే అనుకున్నా.. ఈ నెల 5న జరిగిన మంత్రి మండలి భేటీలో స్కూల్ ఎడ్యుకేషన్‌‌లో ఈ–లర్నింగ్‌ తో పాటు అడ్మిషన్ల నిర్వహణకు ఆమోదం తెలిపారు.

ముందుగా ఈ నెల 20 నుంచి ఆన్‌‌లైన్ క్లాసులు స్టార్ట్‌‌ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ మళ్లీ వెనక్కి తగ్గింది. అన్ని ఏర్పాటు చేశాక వచ్చేనెల 1 నుంచి అన్ని బడుల్లోని పిల్లలకు టీవీలు, టీ శాట్ ద్వారా క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. గురువారం నుంచి టీచర్లు బడులకు వచ్చి ఈ కంటెంట్, లెస్సన్స్‌‌ ​ప్లాన్ చేయాలంది. కేంద్రం ఆదేశాల మేరకు బడుల్లో సాధారణ క్లాసుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

ట్రాన్స్‌ పోర్ట్ ఎట్ల?

గురువారం నుంచి టీచర్లు బడులకు రావాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కానీ కరోనా కేసులు పెరుగుతుండటంతో స్టేట్‌‌లో ఆర్టీసీ బస్సులు నడపట్లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో సిటీ బస్సులు బంద్‌ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నూ బస్సులు కనిపించట్లేదు. కేవలం మెయిన్ రూట్లలో నే నడిపిస్తున్నారు. దీంతో టీచర్లు స్కూళ్లకు ఎలా వెళ్లాలని అడుగుతున్నారు. జిల్లా కేంద్రాల్లో ఉంటున్న టీచర్లూ ఇదే ప్రశ్న వేస్తున్నారు. మరోవైపు ఈ నెల 17 నుంచి ఇంటర్ ఆన్‌‌లైన్ క్లాసులు స్టార్ట్‌‌ చేస్తామని, 14 నుంచి కాలేజీలకు రావాలని లెక్చరర్లకు ఇంటర్ బోర్డు ఆదేశాలిచ్చింది. కానీ వెంటనే ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. బడుల్లో ఆన్‌‌లైన్ క్లాసుల విషయంలోనూ ఇదే జరిగొచ్చని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది.