అందెల రవళులే అటువైపు నడిపించాయి

అందెల రవళులే అటువైపు నడిపించాయి

ఏ సినిమా పాటైనా..అది ఎంత పెద్ద బ్లాక్​ బస్టర్ అయినా... అందరి చూపు ఆ పాటలో కనిపించిన హీరోహీరోయిన్లపైనే ఉంటుంది. ఎప్పుడో  ఒకసారి ఆ పాట కట్టిన వాళ్లు, దానికి స్టెప్పులు వేయించిన వాళ్ల పేర్లు వినపడతాయి. కానీ, బాహుబలిలోని​ ‘కన్నా నిదురించరా...’ పాట చూసినవాళ్లంతా అనుష్క నుంచి ఓ క్షణం చూపు తిప్పుకుంటారు. ఆ పాటలో అనుష్కతో పాటు డాన్స్​ చేసిన అశ్రిత వేముగంటి దగ్గర అందరి చూపులు ఆగిపోతాయి. ఆ పాటతో పాటు ‘యాత్ర, క్రాక్​, డియర్​ కామ్రేడ్’ లాంటి మరెన్నో సినిమాల్లో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ క్లాసికల్​ డాన్సర్​ త్వరలో ‘గాలివాన’ వెబ్​సిరీస్​తో అందరి ముందుకి రాబోతోంది. ఆ విశేషాలన్నీ  ఆమె మాటల్లోనే.. 

అమ్మ డాక్టర్​, సైంటిస్ట్​.  నాన్న  సాఫ్ట్​వేర్​లో మేనేజ్​మెంట్​​ కన్సల్టెంట్​. మిగతా ఫ్యామిలీ మెంబర్స్​ కూడా పెద్ద చదువులు చదువుకున్నారు. ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలపై చాలా ఎక్స్​పెక్టేషన్స్​ ఉంటాయి. వాటికి తగ్గట్టే చిన్నప్పట్నించీ అకడమిక్స్​లో  బాగా స్కోర్​ చేసేదాన్ని. నాకిష్టమైన భరతనాట్యం, కూచిపూడిల్లో ప్రదర్శనలిస్తుండేదాన్ని. ఈ రెండింటి మధ్యే తిరుగుతున్న నా లైఫ్​ని మరో మలుపు తిప్పింది ‘బాహుబలి’ సినిమా. అది కూడా వెతుక్కుంటూ వచ్చి మరీ.  దానికి కారణం కూడా నా డాన్స్. ఐదేండ్ల వయసులో కాలికి కట్టిన గజ్జలే నన్ను సిల్వర్​ స్ర్కీన్​ వరకు నడిపించాయి. క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఇచ్చాయి. 

టీవీ చూస్తూ
ఐదేండ్లు ఉన్నప్పుడు టీవీలో డాన్స్​లు చూసి నేను చేస్తుంటే.. రిథమ్​ బాగుండటంతో క్లాసికల్​ డాన్స్ నేర్పించింది అమ్మ. అలా ప్రియ కార్తికేయన్​ దగ్గర పదేండ్లు భరతనాట్యం నేర్చుకున్నా. ఆ తర్వాత డాక్టర్​ రాజేశ్వరి దగ్గర ట్రైన్​ అయ్యా. చెన్నైలోని  కూచిపూడి ఆర్ట్​ అకాడమీలో కూచిపూడి నేర్చుకున్నా. అయితే చిన్నప్పట్నించీ డాన్స్​తో సమానంగా చదువుని ప్రేమించా. స్కూల్​ నుంచి గ్రాడ్యుయేషన్​ వరకు అన్నింట్లో టాపర్​ని. గ్రాడ్యుయేషన్​లో సైకాలజీ పూర్తిచేశాక డాన్స్​ గురించి మరింత తెలుసుకోవాలనుకున్నా. శోభన లైవ్​ డాన్స్​ పర్ఫార్మెన్స్​లు, ఆమె నటించిన ‘డాన్స్​ లైక్​ ఎ మెన్’ అనే ఫిల్మ్  చూసి ఇన్​స్పైర్​ అయ్యా. యూట్యూబ్​లో అలర్మేల్​వల్లి, మల్లికా సారాభాయ్​ పర్ఫార్మెన్స్​లు చూశాక.. అసలు డాన్స్​ ఎక్కడ మొదలైంది అన్న ప్రశ్న మొదలైంది. దానికి సమాధానం వెతుక్కుంటూ చెన్నై వెళ్లి మద్రాసు యూనివర్సిటీలో  పర్ఫార్మింగ్​  ఆర్ట్స్​లో భరతనాట్యంలో మాస్టర్స్​ చేశా. కూచిపూడి కూడా నేర్చుకున్నా. ఆ రెండేండ్ల జీవితం అప్పటివరకు ఉన్న నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పొచ్చు. చెన్నైలో నేను ఇచ్చిన పర్ఫార్మెన్స్​లు చూసి ఏ.ఆర్. మురగదాస్​ గారితో పాటు చాలామంది సినిమా ఆఫర్స్​ ఇచ్చారు. కానీ, యాక్టింగ్​ ఆలోచన లేకపోవడంతో వాటన్నింటినీ వద్దనుకొని మాస్టర్స్​లో గోల్డ్​  మెడల్​తో తిరిగి హైదరాబాద్​ షిఫ్ట్​ అయ్యా. 

వాళ్ల  కంట్లో పడ్డా
నాతో పాటు మాస్టర్స్​ చేసినవాళ్లలో చాలామంది డాన్స్​ స్కూల్స్​ పెట్టుకున్నారు. మరికొందరు పర్ఫార్మింగ్​ ఆర్గనైజేషన్స్​లో చేరారు. ఇంకొందరు పీహెచ్​డీ వైపు వెళ్లారు. ‘నెక్స్ట్​ ఏంటి?’ అని ఆలోచించా. ఆ టైంలో ‘నీ స్ర్కీన్​ ప్రజెన్స్​ బాగుంటుంది.. టీవీ ఇండస్ట్రీ వైపు వెళ్లొచ్చు’గా అని తెలిసినవాళ్లు అన్నారు. దాంతో  ‘టాలీవుడ్’​ అనే ఛానెల్​లో యాంకర్​గా చేరా.  ఆ తర్వాత ‘ఎస్​వీబీసీ’లో ‘గీతాంజలి’ అనే ప్రోగ్రాం హోస్ట్​ చేశా. నా యాంకరింగ్​ కెరీర్​ని మరో మలుపు తిప్పింది కె. విశ్వనాథ్​గారితో చేసిన డాక్యుమెంటరీలు, షోలు. ఆ షో పూర్తయ్యాక రాజమౌళి గారి నుంచి పిలుపు వచ్చింది. అదెలాగంటే ‘అంతకుముందు ఆ తరువాత’ సినిమా ఆడియో  ఫంక్షన్​లో డాన్స్​ పర్ఫార్మెన్స్ ఇచ్చా. ఆ ఫంక్షన్​కి గెస్ట్​గా రాజమౌళిగారి ఫ్యామిలీ అందరూ వచ్చారు. అక్కడే ఆయన నన్ను చూశారట. ఆ ఫంక్షన్​ అయిన నెలకి నాకు కార్తికేయ నుంచి ఫోన్​ ‘ మీరు ఇంతకుముందు ఏమైనా సినిమాలు చేశారా? అని అడిగారాయన. ‘లేదు’ అన్నా. ‘పోనీ ఇంట్రెస్ట్​ ఉందా? ఒక రోల్​ అనుకుంటున్నాం చేస్తారా?’ అని అడిగారు.  ఇంట్లో వాళ్లని ఎలాగోలా ఒప్పించి స్ర్కీన్​ టెస్ట్​కి వెళ్లా. అక్కడ ఒక డాన్స్​ స్కిట్​ ఇవ్వడం.. అందులో నా పర్ఫార్మెన్స్​ వాళ్లకి నచ్చడంతో  వెంటనే ‘ఓకే’ చేశారు.

సెలక్టెడ్​గా వెళ్తున్నా 
బాహుబలి రిలీజ్​ అయ్యాక వరుసకట్టి  సినిమా అవకాశాలొచ్చాయి. కానీ, సెలక్టెడ్​గా వెళ్లాలనుకున్నా. నా కెరీర్​ని ఒక మెట్టు పైకి ఎక్కించే క్యారెక్టర్స్​ మాత్రమే చేయాలనుకున్నా. అలా నేను ఎంచుకున్న ‘యాత్ర’ సినిమా నన్ను యాక్టర్​గా మరింత మందికి దగ్గరకు చేసింది. అలాగే ‘డియర్​ కామ్రేడ్​, క్రాక్,’ కన్నడలో చేసిన ‘కురుక్షేత్ర’ ​ సినిమాలు కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం  బీబీసి స్టూడియోస్‌‌, నార్త్‌‌స్టార్‌‌ ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ కలిసి నిర్మిస్తున్న ‘గాలివాన’ వెబ్​సిరీస్​లో నటిస్తున్నా. అలాగే ఇంకొన్ని ప్రాజెక్ట్స్​ చేతిలో ఉన్నాయి. అయితే ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్స్​ అన్నీ నా వయసుకి మించినవే. నా ఏజ్​ క్యారెక్టర్​ ఒక్కటీ రాలేదు నాకు. అయితే ఇది నా ఒక్కదాని పరిస్థితి కాదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న లేడీ క్యారెక్టర్​ ఆర్టిస్ట్​లలో చాలామంది 20, 30  యేండ్లకే మదర్​ క్యారెక్టర్స్​ వేస్తున్నారు.  కానీ, నాకెందుకో ఈ ఫార్మాట్​ కరెక్ట్​ అనిపించట్లేదు.  ఇరవైయేండ్లు ఉంటే హీరోయిన్​, కాస్త వయసు పెరిగితే మదర్​..మరి 30–40 మధ్యలో ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటి?  ఈ ఏజ్​ గ్రూప్​ని  మంచి క్యారెక్టర్స్​లో చూపించొచ్చుగా అనిపిస్తుంటుంది. త్వరలోనే ఈ ట్రెండ్​ మారుతుంది అనుకుంటున్నా. 

ఆ యాడ్​ చాలా స్పెషల్​
‘బాహుబలి’ సినిమా కంటే ముందే నాకు పెండ్లి అయింది. మా ఆయన రఘువంశీ నండూరి. ఆయన నా సపోర్ట్​ సిస్టమ్​. పెండ్లికి ముందే తనకి నేను సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నా అని క్లియర్​గా చెప్పా. ఆయన వెంటనే సినిమా హిట్​ అయితే ‘ఇద్దరం కలిసి సెలబ్రేట్​ చేసుకుందాం’ అన్నారు.  నా దగ్గరికి ఏ సినిమా వచ్చినా తనతోనే ఫస్ట్​ డిస్కస్​ చేస్తా. నా యాక్టింగ్​కి మొదటి క్రిటిక్​ కూడా తనే.  పోయిన ఏడాది బాబు పుట్టాడు. వాడి రాకతో నా లైఫ్​ పూర్తిగా మారిపోయింది. మదర్​హుడ్​ని బాగా ఎంజాయ్​ చేస్తున్నా.  అయితే ఒక బిడ్డకి తల్లయ్యాక ఫిజికల్​గా బాడీలో చాలా మార్పులు వస్తాయి. వాటిని ఓవర్​ కమ్​ చేయడానికి ప్రయత్నిస్తున్నా. అలాగే సీనియర్​ యాక్టర్స్​ అమితాబ్​బచ్చన్​, ప్రభు, శివ రాజ్​కుమార్​ , నాగార్జున గారితో చేసిన జువెలరీ యాడ్​ నాకెప్పటికీ మెమరబుల్​. ’

అలాంటి క్యారెక్టర్స్​ చేయాలనుంది​ 
డాన్స్​ నాకు చిన్నప్పట్నించీ అలవాటైన ప్రపంచం. యాక్టింగ్​ ఈ మధ్య అలవాటైన ప్రపంచం. ఈ రెండింటికి కొత్త, పాత అన్న ఒక్క ఫ్యాక్టర్​ తప్పించి  తేడాం ఏం లేదు. రెండూ ఇంపార్టెంట్​ నాకు. అందుకే యాక్టింగ్​లో బిజీ అయినా డాన్స్​ని వదల్లేదు. ‘సద్యోణి’ అనే డాన్స్​ అకాడమీ నడుపుతున్నా. పిల్లలకి డాన్స్​ నేర్పిస్తూ నా ఇన్నేండ్ల ప్రాక్టీస్​ని రివైజ్​ చేసుకుంటున్నా. అలాగే ప్రస్తుతం భరతనాట్యంలో ఎమ్​ఫిల్ చేస్తున్నా. ఫ్యూచర్​లో పీహెచ్​డీ చేయాలనుకుంటున్నా. జయసుధగారిలా డిఫరెంట్​ క్యారెక్టర్స్ చేయాలన్నది 
నా డ్రీమ్​. ప్రస్తుతం స్మితామాధవ్​తో కలిసి భరత నాట్యంలో అడుగులేస్తున్నా.

- ఆవుల యమున