ఇవాళ ఖైరతాబాద్ మట్టి గణపతికి తొలిపూజ

ఇవాళ  ఖైరతాబాద్ మట్టి గణపతికి తొలిపూజ

ఖైరతాబాద్ మహా గణేషుడు ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడు తొలిపూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. 50 అడుగుల ఎత్తులో కొలువుదీరిన ఈ విఘ్నేషుడికి  నేడు ఉదయం 6 గంటలకు సంప్రదాయబద్దంగా నిర్వాహకులు యజ్ఞం కార్యక్రమం నిర్వహించారు. నేడు గణేష్ చతుర్థి సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ దంపతులు కాసేపట్లో తొలి పూజ చేయనున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది. దాదాపు 68ఏళ్ల ఖైరతాబాద్ గణేష్ చరిత్రలో మొట్టమొదటి సారి శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శమివ్వనున్నాడు. అంతే కాదు కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహా గాయత్రీ దేవి కొలువు తీరారు. వీటన్నికంటే ముఖ్యమైన మరో విషయమేమిటంటే.. గత 60 ఏళ్లలో మొదటిసారి ఖైరతాబాద్ గణేషున్ని మట్టితో చేశారు. ఇక జూన్ 10నుంచి మొదలైన ఈ విగ్రహ నిర్మాణాన్ని 150మంది కళాకారులు దాదాపు 80రోజులు పగలనక, రాత్రనక శ్రమించి ఓ చక్కటి ఆకారాన్ని సృష్టించారు. ఈ గణేష్ నిర్మాణ వ్యయం కోటిన్నర అయిందని సమాచారం.

ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం ఏటా  ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాడు. కరోనా మహమ్మారి వల్ల రెండేళ్లుగా గణేష్ ఉత్సవాలకు దూరమైన భక్తులు, ప్రజలు ఈసారి ఉత్సవాలు ఉత్సాహంగా జరుపుకునేందుకు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో  గణేష్ చవితి రోజున మండపాలకు తరలివస్తున్న గణేష్ విగ్రహాలతో సందడి వాతావరణం ఏర్పడింది. పంచముఖ శ్రీలక్ష్మీ మహాగణపతిగా దర్శనమిస్తోన్న స్వామివారిని చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గణేష్ పరిసరి ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు.