ఉత్సాహంగా క్లీన్ ఖమ్మం.. క్లీన్ ఖిల్లా

ఉత్సాహంగా క్లీన్ ఖమ్మం.. క్లీన్ ఖిల్లా

ఖమ్మం టౌన్, వెలుగు:  ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా మార్చాలనే లక్ష్యంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు, కాంగ్రెస్ యువనేత తుమ్మల యుగంధర్ ఆధ్వర్యంలో సోమవారం ‘క్లీన్ ఖమ్మం, క్లీన్ ఖిల్లా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తలు ఉత్సాహంగా శుభ్రతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచే ఖిల్లా ప్రాంగణంలో శుభ్రతా కార్యక్రమం ప్రారంభమైంది. 37, 38, 39, 42 డివిజన్ పరిధిలోని చెట్లు, చెత్త, వాడుకలో లేని పదార్థాలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది, డీఆర్‌ఎఫ్ బృందంతో పాటు ఖమ్మం నగరంలోని 60 డివిజన్లకు చెందిన యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. 

మొత్తం ఖిల్లా ప్రాంగణం అంతా పరిశుభ్రంగా చేయడంతో పాటు చెత్తను తొలగించి, పచ్చదనాన్ని కాపాడే పనులు చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. పరిశుభ్రత అంటే కేవలం ఒక రోజు కార్యక్రమం కాదని, మనందరి జీవనశైలిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఇకపై ప్రతి వారం ఖమ్మం నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర మేయర్ పునకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, నేతలు సాధు రమేశ్​రెడ్డి, తుపాకుల యలగొండ స్వామి, మొహమ్మద్ ఆశ్రిఫ్, కార్పొరేటర్లు రాపర్తి శరత్, షౌకత్ అలీ పాల్గొన్నారు.