లడక్ కోసం మరోసారి దీక్ష చేస్త: పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ ఛుక్ హెచ్చరిక

లడక్ కోసం మరోసారి దీక్ష చేస్త: పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ ఛుక్ హెచ్చరిక
  • పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ ఛుక్ హెచ్చరిక

లడఖ్: పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ ఛుక్ తాను మరోసారి నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. లడఖ్కు రాష్ట్ర హోదా, రాజ్యాంగ పరిరక్షణ డిమాండ్లపై అధికారులను చర్చలకు ఆహ్వానించకపోతే ఆగస్టు 15 నుంచి నిరసన తెలుపుతానని ప్రకటించారు. ఆదివారం వాంగ్ ఛుక్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇటీవల ప్రధాని మోదీ ద్రాస్ సెక్టార్ను సందర్శించినప్పుడు అపెక్స్ బాడీ లేహ్ (ఏబీఎల్), ద కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ (కేడీఏ)కు చెందిన నేతలు మెమోరాండం సమర్పించారని తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరామని చెప్పారు. ‘‘ఎన్నికల సమయంలో మేం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయదల్చుకోలేదు. కొంచెం సమయం ఇవ్వాలనుకున్నాం. కొత్త సర్కారు కొన్ని కచ్చితమైన చర్యలు తీసుకుంటుందనుకున్నాం. మెమోరాండం సమర్పించిన అనంతరం మా నాయకులను చర్చలకు ఆహ్వానిస్తారని ఆశించాం. ఒకవేళ అది జరగకపోతే ఆగస్టు 15 నుంచి మరోసారి నిరాహార దీక్షకు దిగుతా. 28 రోజుల పాటు దీక్షను కొనసాగిస్తా” అని పేర్కొన్నారు.