ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సవాల్ వాతావరణ మార్పులు. దాని విపరిణామాలే అసాధారణ వానలు, వరదలు, ఎండలు, చలి. అనుకున్నదానికన్నా వేగంగా ఈ విపత్తు ప్రపంచ మానవాళిని ప్రమాదంలోకి నెడుతోంది. సమస్య తీవ్రతను గుర్తించినా మానవ సమాజం తగురీతిలో స్పందించడం లేదనిపిస్తోంది.
అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో కీలక శిఖరాగ్ర సమావేశాలు జరుపుతున్నప్పటికీ, బాధ్యతగల ముఖ్య దేశాల జవాబుదారీతనం లోపించడం వల్ల ఆశించిన స్థాయిలో ఫలితాలుండటం లేదు. ప్రభుత్వాలొకవైపు, కార్పొరేట్లు మరొకవైపు, పౌర సంస్థలు, ప్రజాసంఘాలు, అందరం కలిసి ఉద్యమిస్తేనే విష కాలుష్యాల నుంచి, పెరుగుతున్న భూతాపం నుంచి, దానివల్ల వస్తున్న వాతావరణ మార్పుల నుంచీ బయటపడగలుగుతాం.
మన దేశంలోనే కాకుండా ప్రపంచస్థాయిలో కూడా 2025 అత్యధిక ఉష్ణోగ్రతల సంవత్సరంగా నమోదైంది. అలా నమోదవడం వరుసగా ఇది మూడో సంవత్సరం! మనిషి మనుగడ ప్రారంభమైన నుంచి కూడా ఇంతటి ఎండలు, వరదలు, తుఫాన్ తీవ్రతలు ఇదివరకెప్పుడూ లేవు. లోగడ జల, వాయు కాలుష్యాలు, భూగ్రహం వేడెక్కడం, వాతావరణ మార్పులు అనేది ఎవరో సైంటిస్టులు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు మాట్లాడుకునే మాటగా ఉండేది. కానీ, ఇప్పుడిది అందరూ మాట్లాడే సాధారణ విషయమైపోయింది.
కాలుష్యమే కారణం!
మనిషి జోక్యం లేనంతకాలం, కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ప్రకృతి ప్రశాంతంగా ఉంది. మనిషి పుట్టి, అతనిలో స్వార్థం పెరిగి, సుఖాలకు మరిగిన తర్వాత ప్రకృతిలో సమతూకం చెడింది. వాతావరణం కాలుష్యమవుతోంది. కార్బన్ డయాక్సైడ్, ఇతర గ్రీన్‌హౌజ్ గ్యాసెస్ అసాధారణంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పారిశ్రామికీకరణ తర్వాత ఆ వేగం మరింత పెరిగింది. 2030 నాటికి భూమి వేడి పెరుగుదలను 2 డిగ్రీలకు మించనీయకూడదని ప్రపంచ దేశాలన్నీ ఓ అంగీకారానికి వచ్చాయి.
కానీ, పారిశ్రామికీకరణ ముందరి కన్నా 1.47 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల ఇప్పటికే నమోదయింది. దాని దుష్పరిణామాలతో భూమిపైకి వచ్చే ప్రమాదకర సూర్యకిరణాల తీవ్రతను తగ్గించే ‘ఓజోన్ పొర’కు తూట్లు పడింది. ధృవాల మంచు కరిగి సముద్ర జలమట్టాలు పెరిగి, తీర నగరాలు నీట మునిగే ప్రమాదం అధికమయింది. కొన్ని చిన్న చిన్న దీవులు ఇప్పటికే మునిగిపోయాయి.
సరిదిద్దలేని దుష్పరిణామాలు
వాతావరణ మార్పుల సమస్యను మొదట 1970లలో అంతర్జాతీయ సమాజం గుర్తించింది. 1972లో ఐక్యరాజ్యసమితి ఒక సదస్సు ఏర్పాటు చేసింది. స్వీడన్, స్టాక్‌హోంలో జరిగిన ఈ ‘యూఎన్’ సదస్సుకు నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ హాజరయ్యారు. ఆ స్ఫూర్తిని ఆమె యధాతథంగా ఇక్కడ అమలు చేయడం వల్లే దేశంలో పర్యావరణ చట్టం, నీటి చట్టం, గాలి చట్టం, అటవుల రక్షణ చట్టం, వన్యప్రాణుల సంరక్షణ చట్టం వంటివి వచ్చాయి.
తర్వాత కాలంలో అంతర్జాతీయంగా అనేక సదస్సులు, ఒప్పందాలు, ప్రపంచ వివిధ దేశాల ఉమ్మడి అంగీకారాలు వంటివన్నీ వచ్చాయి. 2000 సంవత్సరంలో ‘మిలీనియం గోల్స్’ ప్రకటించిన ఐక్యరాజ్యసమితి 2015 తర్వాత, ఆచరించవలసిన 17 ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల’ను ప్రపంచ దేశాలకు నిర్దేశించింది. ‘ప్యారిస్ ఒప్పందం’తోపాటు ఏటా జరుగుతున్న ‘కాప్’ సదస్సుల ద్వారా భాగస్వామ్య దేశాలు తమ నిబద్ధతను ప్రకటిస్తున్నాయి. తాము నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ది లక్ష్యాల్లో 35 శాతం మేర జరిగినట్టు యూఎన్ ఒక తాజా నివేదికలో వెల్లడించింది.
తగు చర్యలే పరిష్కారాలు
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం ఎంత తీవ్రమైన స్థితికి చేరిందో! తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఇటీవల నేను ఢిల్లీ పర్యటనకు వెళ్లి మూడు రోజులున్నపుడు ప్రత్యక్షంగా అనుభవించాను. ఆరోగ్యమైన మనిషికి కూడా రాత్రిపూట ఊపిరాడని పరిస్థితి! తెలంగాణలో మన ప్రభుత్వం ఏర్పడ్డ నుంచీ రవాణా మంత్రిగా ఈ విషయాన్ని నేను నిశితంగా గమనిస్తున్నాను. చట్టబద్ధమైన వివిధ చర్యల ద్వారా వాహనాల పనితీరును, కండిషన్స్‌ను మెరుగుపరుస్తున్నాం.
పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడే పరిస్థితిని తప్పించి, పునరుత్పాదక ఇంధనాల వినియోగం వైపు మొగ్గే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అందుకే, ఆర్టీసీతో సహా సాధ్యమైన అన్నిచోట్ల విద్యుత్ వాహనాల (ఈవీ) వాడకాన్ని పెంచుతున్నాం. రోడ్లపైన వాటి సంఖ్యను మరింత పెంచే ఉద్దేశ్యంతో ఈవీ కొనుగోనుదారులను రాయితీలు, పన్ను మినహాయింపులతో ప్రోత్సహిస్తున్నాం. చార్జింగ్ సెంటర్ల సంఖ్య పెంచే చర్యల్ని ముమ్మరం చేస్తున్నాం. ప్రభుత్వపరంగా ఇటువంటి చర్యలన్నింటికీ మేం సదా సిద్ధం. ప్రపంచ ఆర్థిక సదస్సు జరిగిన ‘దావోస్ వేదిక’ నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ‘నెట్ జీరో’ నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధిపరుస్తామని ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామం. దీన్ని మనమంతా స్వాగతించాలి.
యువత, విద్యార్థులు ముందుకురావాలి
ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం మనది. భూగ్రహం తాజా పరిస్థితి, విశ్వం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నేటి యువత, ముఖ్యంగా విద్యార్థులు చక్కని అవగాహన కలిగి ఉండాలి. రేపటి వాతావరణ మార్పు సమస్య తీవ్రతను వారే సమర్థంగా ఎదుర్కొనగలరు. సరైన పరిష్కారాలను కనుగొనగలరు. శాస్త్ర సాంకేతిక ప్రగతి, ఏఐ ఎదిగిన కాలమిది! దాన్ని సమర్థంగా వినియోగించుకోవాలి. విద్యార్థి ఉద్యమాల నుంచి, యువజన పోరాటాల నుంచి రాజకీయంగా ఎదిగివచ్చిన నాకు మన యువతరం సృజనపట్ల అపారమైన నమ్మకం, అచంచలమైన విశ్వాసం ఉన్నాయి. సరైన అవగాహనతో, సమగ్ర ధృక్పథంతో ముందుకు కదిలితే యువత సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. వారికిదే నా ఆహ్వానం.
- - పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా, వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖల మంత్రి
