- సెన్సెక్స్ 609 పాయింట్లు డౌన్
- 26 వేల దిగువన నిఫ్టీ
- భారీగా ప్రాఫిట్ బుకింగ్
- విదేశీ నిధులు వెనక్కి
ముంబై: ప్రాఫిట్ బుకింగ్‌కు తోడు, విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలు కొనసాగించడంతో సోమవారం స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ పాలసీ నిర్ణయం ముందు పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. సెన్సెక్స్ 609.68 పాయింట్లు పతనమై 85,102.69 వద్ద ముగిసింది. ఒకానొక దశలో ఇది 836.78 పాయింట్లు తగ్గి 84,875.59 కనిష్ట స్థాయిని తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 225.90 పాయింట్లు క్షీణించి 25,960.55 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 294.2 పాయింట్లు పతనమై 25,892.25 కనిష్టానికి చేరింది.
ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ ఒక్క రోజులోనే రూ. 7.12 లక్షల కోట్లకు పైగా తగ్గింది. సెన్సెక్స్‌లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎటర్నల్, ట్రెంట్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్, టైటాన్, ఎన్టీపీసీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎయిర్‌టెల్ షేర్లు నష్టపోయాయి. టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాత్రమే లాభపడ్డాయి.
ఇతర సూచీలూ కిందకే..
బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.73 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2.20 శాతం పడ్డాయి. మొత్తం 3,348 స్టాక్‌లు క్షీణించగా, 950 స్టాక్‌లు పెరిగాయి. సెక్టోరల్ ఇండెక్స్‌లలో సర్వీసెస్ 3.70 శాతం, రియాల్టీ 3.50 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.83 శాతం, టెలికమ్యూనికేషన్ 2.53 శాతం, ఇండస్ట్రియల్స్ 2.21 శాతం, యుటిలిటీస్ 2.10 శాతం, మెటల్ 1.96 శాతం, పవర్ 1.84 శాతం పతనమయ్యాయి. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 90.11కు పడిపోయింది.
ముడి చమురు ధరలు పెరగడం కూడా సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. ఈ నెల రెండో తేదీ నుంచి విమాన సేవలు నిలిచిపోవడం ఏడవ రోజుకు చేరుకోవడంతో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో పేరెంట్ కంపెనీ) షేర్లు సుమారు 9 శాతం పడిపోయి రూ.4,926.55 వద్ద ముగిశాయి. ఎఫ్ఐఐలు శుక్రవారం రూ.438.90 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.4,189.17 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. బ్రెంట్ క్రూడ్ ధర 0.61 శాతం తగ్గి బ్యారెల్‌కు 63.37 డాలర్లకు పడిపోయింది.
