
హైదరాబాద్ : టీఆర్ఎస్ లో కాంగ్రెస్ విలీన ప్రక్రియ వేగంగా జరిగిపోతోంది. హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్ వేదికగా రాజకీయ వ్యూహం ఖరారైంది. ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. సీఎల్పీ విలీన ప్రక్రియ వేగమందుకుంది. విలీనం జరగాలంటే.. మూడింట రెండువంతులు .. అంటే.. మొత్తం 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కనీసం 13 మంది అంగీకారం తెలపాలి. ఉత్తమ్ రాజీనామాతో.. ఆ సంఖ్య 12కు తగ్గింది. సీఎల్పీ విలీనానికి అవసరమైన 12 మంది ఎమ్మెల్యేలు తమ అంగీకారం తెలపడంతో.. టీఆర్ఎస్ ఈ ప్రక్రియను వేగవంతం చేసింది.
ఈ మధ్యాహ్నం సీఎం క్యాంప్ ఆఫీస్ వేదికగా 12 మంది ‘కాంగ్రెస్ నుంచి ఎన్నికై టీఆర్ఎస్ లో చేరిన’ ఎమ్మెల్యేలకు కేటీఆర్ విందు ఇచ్చారు. ఆ సమావేశంలోనే విలీన ప్రతిపాదనపై ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఈ డాక్యుమెంట్ తో ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్ నుంచి నేరుగా మినిస్టర్స్ క్వార్టర్స్ కు చేరుకున్నారు. అక్కడ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి విలీన ప్రతిపాదన పత్రాన్ని అందజేశారు.
స్పీకర్ ఆమోదం తర్వాత.. విలీన ప్రకియ పూర్తి కానుంది.