
కరీంనగర్ టౌన్, వెలుగు: కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆఫీసర్లకు ఆదేశించారు. బుధవారం సిటీలోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ.16.5 కోట్లతో ప్రారంభించిన నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు.
భవనంలో అన్ని వసతులు, అధునాతన సౌకర్యాలు సమకూర్చాలని అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతం ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ మున్సిపల్ ఆఫీస్‌లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగరవ్యాప్తంగా ఉన్న సుమారు 350 సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, ఈఈ యాదగిరి, డీఈ లచ్చిరెడ్డి, అయూబ్ ఖాన్ పాల్గొన్నారు.