
శివ్వంపేట, వెలుగు: ఏళ్లుగా ఉన్న పార్ట్ బీ సమస్య పరిష్కరించి పట్టా పాస్ పుస్తకాలు ఇప్పించాలని బుధవారం రైతులు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి గాంధీ భవన్ లో వినతిపత్రం అందజేశారు. శివ్వంపేట మండలంలోని నవాపేట గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూ ప్రక్షాళన సందర్భంగా 600 మంది రైతులకు సంబంధించి దాదాపు 1,500 ఎకరాల భూమి పార్ట్ బీ లో పెట్టారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
పట్టా పాస్ బుక్ లు లేక పోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల ప్రయోజనాలు అందడం లేదన్నారు. నవాపేట మీదుగా వెళ్లే రోడ్డు దుస్థితిని మంత్రికి తెలిపి రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి వెంటనే కలెక్టర్ తో ఫోన్ మాట్లాడి నవాపేట రైతుల భూ సమస్యను, రోడ్డు సమస్యను పరిష్కరించాలని ఆదేశించినట్టు నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు.
మంత్రి వివేక్ ను కలిసిన కార్మిక నాయకులు
జిన్నారం : ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని హార్టెక్స్ రబ్బరు పరిశ్రమ యూనియన్ సంఘం గుర్తింపు ఎన్నికల్లో గెలిచిన రాములు నాయక్, వరప్రసాద్ రెడ్డి బుధవారం హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రి వివేక్ వెంకట్ స్వామిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. యాజమాన్యాలు కార్మికుల శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా చూడాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో పరిశ్రమ జనరల్ సెక్రెటరీ లఖన్ సింగ్, కార్మిక నాయకులు ఉద్యానంద్, ధర్మేందర్ యాదవ్, ఉమాకాంత్, తివారి, సంతోష్ ఉన్నారు