ఇదే మణిపూర్ ఘటన.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగి ఉంటే : మోదీని ప్రశ్నించిన సీఎం

ఇదే మణిపూర్ ఘటన.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగి ఉంటే : మోదీని ప్రశ్నించిన సీఎం


మణిపూర్లో హింసాత్మక అల్లర్లు, మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలపై సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ  కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రధాని మోదీపై మండిపడ్డారు. 

మణిపూర్ కు వెళ్లడం లేదు..

మణిపూర్ అట్టుడుకుతున్నా...అక్కడ అల్లర్లతో హింస జరుగుతున్నా..ప్రధాని మోదీ మణిపూర్లో ఎందుకు పర్యటించడం లేదని అశోక్ గెహ్లాట్ ప్రశ్నించారు.  ఎన్నికల కోసం రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ వంటి ప్రాంతాల్లో పర్యటించే మోదీ...మణిపూర్ కు ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. ఇలాంటి ప్రధానిని తాను ఎన్నడూ చూడలేదని విమర్శించారు. 

అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మాత్రం..

మణిపూర్‌లో ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే కదా అని..అక్కడకు వెళ్లడానికి ప్రధాని మోదీకి వచ్చిన ఇబ్బంది ఏంటని అశోక్ గెహ్లాట్  ప్రశ్నించారు. ఈ సమయంలో మణిపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే మాత్రం మోదీ  ఏమనేవారో ఊహించుకోవచ్చన్నారు. మణిపూర్ ఘటనపై స్పందించిన మోదీ...రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ పేర్లు ప్రస్తావించారని.. ఆ రాష్ట్రాల్లో శాంతిభద్రతల విషయంలో సీఎంలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మోదీ వ్యాఖ్యలతో రాజస్థాన్ ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నాయని గెహ్లాట్ అన్నారు.  మణిపూర్‌‌లో మోదీ పర్యటించలేకపోతే కనీసం ఒక సమావేశమైనా ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాలని ఆయన సూచించారు.

మోదీ ఏమన్నారంటే..

మణిపూర్ లో జరిగిన ఘటనను ప్రధాని మోదీ ఖండించారు. మణిపూర్ లో కుమార్తెలకు జరిగిన సంఘటన ఎప్పటికీ క్షమించరానిదన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన దోషులను ఎప్పటికీ విడిచిపెట్టబోమన్నారు.  ఇలాంటి ఘటనలు దేశానికి తలవంపులు తెస్తాయన్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో శాంతి భద్రతలను పటిష్టం చేయాలని సీఎంలందరికీ  కోరుతున్నానని మోదీ సూచించారు. అది రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్‌గఢ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు.. రాజకీయాలకు అతీతంగా మహిళలను గౌరవాన్ని కాపాడాల్సి ఉంటుందని మోదీ  అన్నారు.