గాంధీని చంపిన వీళ్లు నన్ను వదిలేస్తారా?

గాంధీని చంపిన వీళ్లు నన్ను వదిలేస్తారా?

కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ లీడర్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యకు వచ్చిన బెదిరింపు కాల్‌లపై విచారణకు ఆదేశించినట్లు ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. తాను సిద్ధరామయ్యను కలిశానని, ఆయనకు అదనపు భద్రతతో పాటు సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లుగా బొమ్మై తెలిపారు. వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు నిన్న (శుక్రవారం) కొడ‌గు ప‌ర్యట‌న‌కు వెళ్లిన సిద్ధరామయ్య కారు పై కొందరు గుడ్లు విసిరి, నల్ల జెండాలు చూపి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయనకు ఈ బెదిరింపు కాల్‌ వచ్చింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటుందని సీఎం బొమ్మై తెలిపారు. బెదిరింపు కాల్స్‌కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని సిద్ధరామయ్యను తాను  కోరినట్లుగా ఆయన తెలిపారు .లా అండ్ ఆర్డర్ గురించి తాను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌తో కూడా మాట్లాడినట్లుగా బొమ్మై వెల్లడించారు. సిద్ధరామయ్యకు అదనపు భద్రత కల్పించాలని డీజీపీని కోరానని స్పష్టం చేశారు. అటు తన పర్యటనలో జరిగిన ఘటన పై సిద్ధరామయ్య  స్పందిస్తూ... గాంధీని చంపిన వీళ్లు నన్ను వదిలేస్తారా? అని ప్రశ్నించారు.