సోమవారం ( జనవరి 5 ) మూడవ ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న నదీ జలాల వివాదంపై స్పందించారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి ఏపీలో ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని.. రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే.. తాను అడ్డుపడలేదని అన్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సామరస్య పరిష్కారం కావాలని అన్నారు చంద్రబాబు. గోదావరి పెన్నా నదుల అనుసంధానం కావాలన్నది తన కల అని..రాబోయే రోజుల్లో అది కచ్చితంగా జరుగుతుందని అన్నారు చంద్రబాబు.
కృష్ణా డెల్టా అభివృద్ధితో పాటు తెలంగాణకు కూడా నీళ్లందించామని అన్నారు సీఎం చంద్రబాబు. ఇది రాజకీయ వేదిక కాదని.. మిగతా విషయాలు తర్వాత మాట్లాడతానని అన్నారు చంద్రబాబు. గత ఏడాది కృష్ణా, గోదావరిలో వేల టీఎంసీలు సముద్రంలో కలిశాయని.. గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే తానెప్పుడూ అడ్డుపడలేదని... గోదావరిలో నీళ్లు ఉన్నాయి కాబట్టే అభ్యంతరం చెప్పలేదని అన్నారు చంద్రబాబు.
నీటి విషయంలో కానీ, సహకారంలో కానీ.. తెలుగువారు ఎప్పుడు ఐకమత్యంగా ఉండాలని అన్నారు. దేశంలో హిందీ మాట్లాడేవారికి ఎక్కువ రాష్ట్రాలుంటే.. తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు ఉండటం తెలుగుజాతికి గర్వకారణమని అన్నారు చంద్రబాబు. జ్యూయిష్ జాతి ప్రపంచంలో నంబర్ వన్ గా ఉన్నారని.. 2047 కల్లా జ్యూయిష్ జాతిని మించిపోయి తెలుగుజాతి నంబర్ వన్ గా ఉండాలనేదే తన ఏకైక లక్ష్యమని అన్నారు చంద్రబాబు.
