
- టెంపరరీగా అప్పటికప్పుడు కొందరికి చైర్లు.. మరికొందరు బయటే
- అసౌకర్యంగానే కొనసాగిన మీటింగ్
హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియెట్‌లో గురువారం సీఎం కేసీఆర్ నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్లేస్ లేక అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఇంత పెద్ద సెక్రటేరియెట్‌లో మంత్రులు, ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు కలిసి కూర్చుని కాన్ఫరెన్స్ పెట్టుకునే పరిస్థితి లేకపోవడంపై పలువురు ఆఫీసర్లు అసహనం వ్యక్తం చేశారు. కొత్తగా నిర్మించిన సెక్రటేరియెట్‌లో తొలిసారి జరిగిన కాన్ఫరెన్స్ లో టెంపరరీగా, అప్పటికప్పుడు కుర్చీలు వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కొందరు కలెక్టర్లు, ఎస్పీలు ఇరుకుగానే కూర్చున్నారు. ఇంకొంతమందికి అసలు సీట్లు లేకపోవడంతో కాన్ఫరెన్స్లో పాల్గొనలేదని తెలిసింది. టీఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో పాటు కొందరు ఉన్నతాధికారులు సమావేశం బయటే ఉండిపోయారు. సెక్రటేరియెట్‌లోని ఆరో అంతస్తులో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. అయితే 10 గంటల కల్లా వచ్చిన ఆఫీసర్లకు కూడా కాన్ఫరెన్స్ హాల్‌లో కూర్చునేందుకు కుర్చీలు దొరకకపోవడం గమనార్హం.
ఇరుకు చాంబర్లపై అసంతృప్తి
కొత్త సెక్రటేరియెట్‌పై ముందు నుంచి ఉన్నతాధికారులు, ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాంబర్లు ఇరుకుగా ఉండటం.. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆ పైస్థాయి ఆఫీసర్లను ఓపెన్ వర్క్ స్పేస్‌లో పని చేయిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. సీఎంఓలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు కూడా చాంబర్ల స్పేస్, కేటాయింపులపై ఇప్పటికీ ముభావంగానే ఉన్నారు. ఇప్పుడు కాన్ఫరెన్స్ మీటింగ్ లో ఉన్నతాధికారులకు కుర్చీలు సరిపోకపోవడంతో ‘ఏదో అనుకుంటే.. ఇట్లుందేంటి’ అని కొందరు వాపోయినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ రివ్యూ చేసే హాల్ కూడా పరిమితంగానే ఉండటంపైనా చర్చ జరుగుతోంది. బయట నుంచి చూసినంత ఘనంగా లోపలేమీ లేదని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.