ఇరిగేషన్ రీ ఆర్గనైజేషన్ కు సీఎం గ్రీన్ సిగ్నల్

ఇరిగేషన్ రీ ఆర్గనైజేషన్ కు సీఎం గ్రీన్ సిగ్నల్

వాటర్ రీసోర్సెస్ డిపార్ట్​మెంట్ గా మార్పు

ఆరుగురు ఈఎన్సీలు.. 19 మంది సీఈలు

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ డిపార్ట్​మెంట్ రీఆర్గనైజేషన్ కు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్ లో అధికారులు, ఇంజనీర్లతో సీఎం సమావేశమై దీనిపై చర్చించి ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. ఇప్పుడు ఐదుగురు ఇంజనీర్ ఇన్ చీఫ్ లు (ఈఎన్సీలు), 13 మంది చీఫ్ ఇంజనీర్లు ఉండగా… పునర్వ్యస్థీకరణ తర్వాత ఆరుగురు ఈఎన్సీలు, 19 మంది సీఈలు ఉంటారు. ఇరిగేషన్, అడ్మినిస్ట్రేషన్, కరీం నగర్, కాళేశ్వరం –1, 2 ఈఎన్సీ పోస్టులకు అదనంగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కు మరో ఈఎన్సీని నియమించనున్నారు. కాళేశ్వరం ఈఎన్సీ పోస్టులను సీఈ స్థాయికి కుదించాలని అనుకున్నా, ఈఎన్సీ పోస్టులనే కంటిన్యూ చేయాలని సీఎం సూచించారు.

ఎలక్ట్రో మెకానికల్ పనులు చూసేందుకు కృష్ణా, గోదావరి బేసిన్ లకు ఒక్కో సీఈని నియమించాలని తొలుత ప్రతిపాదించినా.. ఆ పోస్టులు అవసరం లేదని సీఎం తేల్చేశారు. మైనర్ ఇరిగేషన్ కు ఉన్న రెండు సీఈ పోస్టులను రద్దు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు నిర్వహించే కేబినెట్ మీటింగ్ లో ఈ రీఆర్గనైజేషన్ పై చర్చించి అప్రూవల్ ఇస్తామని.. ఆ వెంటనే జీవో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అప్పటి నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ను వాటర్ రీసోర్సెస్ డిపార్ట్​మెంట్ గా పిలవనున్నారు. డిపార్ట్​మెంట్ రీఆర్గనైజేషన్ పై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి అధికారులతో వర్క్ షాప్ నిర్వహించాలని గతంలో సీఎం సూచించినా ఆ విషయం చర్చకు రాలేదని తెలిసింది.