పాలమూరుపై సీఎం స్పెషల్ ఫోకస్

పాలమూరుపై సీఎం స్పెషల్ ఫోకస్
  • రూ.1,284 కోట్ల అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన
  • ట్రిపుల్​ ఐటీ బ్రాంచ్​ బిల్డింగ్​​ పనులకు భూమిపూజ
  • 50 రోజుల్లోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం మూడో టూర్​
  • సభలో సీఎం మాట్లాడే అంశాలపై సర్వత్రా ఆసక్తి

మహబూబ్​నగర్, వెలుగు: సీఎం ఎనుముల రేవంత్​ రెడ్డి మరోసారి తన సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్​నగర్​ పర్యటనకు షెడ్యూల్​ ఖరారైంది. గతేడాది డిసెంబరు ఒకటిన నారాయణపేట జిల్లా మక్తల్​ మున్సిపాలిటీలో పర్యటించి రూ.4,500 కోట్లతో  చేపట్టనున్న ‘కొడంగల్’ లిఫ్ట్​ స్కీమ్​కు భూమిపూజ చేశారు. అదే నెల డిసెంబరు 24న సీఎం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ లోని కోస్గి మండలకేంద్రానికి వచ్చారు. కొత్తగా ఎన్నికైన నియోజకవర్గ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొని న్యూ ఇయర్​ గిఫ్ట్​గా మేజర్​ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న జీపీలకు రూ.5 లక్షలు ప్రకటించారు.

 తాజాగా శనివారం ఆయన మహబూబ్​నగర్​లో పర్యటించనున్నారు. రూ.1,284.44 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మహబూబ్​నగర్​లో ఎంబీఎస్​ కాలేజ్​ గ్రౌండ్​లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. త్వరలో కార్పొరేషన్, మున్సిపల్​ ఎన్నికలు జరిగే సూచనలు ఉండడంతో..  ఎన్నికల ప్రస్తావన ఆయన ప్రసంగంలో ఉండే అవకాశాలు ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 

రూ.600 కోట్లతో ట్రిపుల్​ ఐటీ బ్రాంచ్​ భవనాలు..

నిర్మల్​ జిల్లా బాసరలోని ట్రిపుల్​ ఐటీ అనుబంధ క్యాంపస్​ను రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది మేలో మహబూబ్​నగర్​ జిల్లాకు మంజూరు చేసింది. ఈ అకడమిక్​ ఇయర్​ నుంచే క్లాసులు ప్రారంభించింది. సొంత భవనం లేకపోవడంతో నగరంలోని రెడ్డి కన్వన్షన్​ హాల్​ను తాత్కాలికంగా అద్దెకు తీసుకొని క్లాసులు ప్రారంభించింది. ప్రస్తుతం రెండేళ్లకు సంబంధించి ప్రీ యూనివర్సిటీ కోర్స్(పీయూసీ) మొదటి సంవత్సరం నడుస్తోంది. 208 మంది పిల్లలు ఉండగా.. ఇందులో 148 మంది బాలికలు, 60 మంది బాయ్స్​ ఉన్నారు. ఫస్ట్​ సెమిస్టర్​ కూడా పూర్తయింది. 

అయితే ట్రిపుల్​ ఐటీ కోసం సొంత భవనాన్ని నిర్మించాల్సి ఉంది. ఇందు కోసం 44 ఎకరాల భూమి అవసరం ఉంది. ఈక్రమంలో గత ఏడాది మే 3న బాసర ట్రిపుల్​ ఐటీ వైస్​ చాన్స్​లర్​ గోవర్దన్, జేఎన్టీయూ మాజీ రిజిస్ట్రార్​ మంజూర్​ హుస్సేన్​ పాలమూరులో పర్యటించారు. మహబూబ్​నగర్​ రూరల్​ మండలం దివిటిపల్లి, ఎదిర మధ్యలో జడ్చర్ల మండలం మల్లెబోయిన్​పల్లి, చిట్టబోయిన్​పల్లి, పాలమూరు యూనివర్సిటీ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల కోసం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం నివేదికను తెలంగాణ కౌన్సిల్​ ఆఫ్​ హయ్యర్​ ఎడ్యుకేషన్​కు అందించగా.. వారు ఈ రిపోర్టును అదే నెల 8న రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు.

 అన్ని అంశాలను పరిశీలించిన ప్రభుత్వం ట్రిపుల్​ ఐటీ బ్రాంచ్​ను నేషనల్​ హైవేకు సమీపంలో ఉన్న దివిటిపల్లి, -ఎదిర వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అక్కడ 44 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా అందుబాటులో ఉండడంతో పనులు మొదలు పెట్టేందుకు అధికార యంత్రాంగం నుంచి ప్రతిపాదనలు తెప్పించుకుంది. ట్రిపుల్​ ఐటీ భవనాల నిర్మాణం కోసం రూ.600 కోట్లు అవసరం కాగా.. రూ.200 కోట్ల చొప్పున మూడు విడతల్లో ఈ నిధులను రాష్ట్ర సర్కారు మంజూరు చేయనుంది. తాజాగా మొదటి విడత కింద రూ.200 కోట్లను శ్యాంక్షన్​ చేయగా.. ఈ పనులకు శనివారం సీఎం  భూమిపూజ చేస్తారు.

రూ.883 కోట్లతో అండర్​ డ్రైనేజీ, శాశ్వత తాగునీరు

కార్పొరేషన్​ పరిధిలో అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ, శాశ్వత తాగునీటి పథకం కోసం రూ.883 కోట్లు మంజూరయ్యారు. ఇందులో రూ.603 కోట్లతో సీవర్​ లైన్(మురుగు నీటిని నగరం బయటకు తరలించే కాలువ) ఏర్పాటు చేయనున్నారు. ఇందుకుగాను  నాలుగు జోన్లుగా నగరాన్ని డివైడ్​ చేశారు. ఇందులో మూడు జోన్లు నగరంలో, మరో జోన్  నగరం బయట ఉంది. ఎర్రకుంట, గోల్​ మసీద్​ ప్రాంతాన్ని ఒక జోన్​గా, పెద్ద చెరువు ప్రాంతాన్ని మరో జోన్​గా, శ్రీనివాస కాలనీ ఏరియాను ఇంకో జోన్, మయూరి పార్క్, కొత్త కలెక్టరేట్​ ప్రాంతాన్ని ఇంకొక జోన్​గా డివైడ్​ చేశారు. 

ఇందులో మయూరి పార్క్, కొత్త కలెక్టరేట్​ జోన్​ నగరం బయట ఉంటాయి. మిగతా మూడు జోన్లు నగరం లోపల ఉంటాయి. ఈ నాలుగు జోన్ల పరిధిలోని 60 డివిజన్లలో సీవర్​ లైన్​ను ఏర్పాటు చేయనున్నారు. రూ.220  కోట్లతో 1.50 కోట్ల లీటర్ల కెపాసిటీ ఉన్న 15 తాగునీటి ట్యాంకులను నిర్మించనున్నారు. ఈ ట్యాంకులను వీరన్నపేట డబుల్​ బెడ్రూమ్, హనుమాన్​పుర, పాత డీఎంహెచ్​వో ఆఫీస్, కలెక్టర్​ క్యాంప్​ ఆఫీస్​, ఇండస్ట్రియల్​ ఏరియా, రామయ్యబౌలి, తిరుమల హిల్స్, మర్లు బైపాస్, ఏనుగొండ, టీచర్స్​​కాలనీ, మెట్టుగడ్డ, జైనల్లీపూర్​ వద్ద నిర్మించనున్నారు. ఈ 15  ట్యాంకులకు నీటిని అందించేందుకు 26 కిలోమీటర్ల మేర ఫీడర్​ మెయిన్​ పైపులైన్. 210 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్​ పైప్​లైన్​ వేయనున్నారు. ఈ లైన్​ ద్వారా కొత్తగా 10 వేల కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

సీఎం సభను సక్సెస్​ చేయాలి

మహబూబ్‌నగర్  పట్టణం 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నగరంలో రూ.1,463 కోట్ల పలు అభివృద్ధి పనులకు సీఎం శనివారం శంకుస్థాపనలు చేస్తారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. సీఎం సభా స్థలి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలమూరు బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి ఫలాలు అందించేందుకు వస్తున్న సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ప్రజలు తరలిరావాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్​ ముదిరాజ్, మైనార్టీ కార్పొరేషన్​ చైర్మన్​ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్  లక్ష్మణ్  యాదవ్, మాజీ మున్సిపల్​ చైర్మన్​ ఆనంద్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ పాల్గొన్నారు.