చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు  ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఏపీ సీఎంవో ట్వీట్ చేసింది. అటు ప్రధాని మోడీ సైతం ఈ ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు   ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మోడీ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలను, గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించారు. 

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ  సభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు. చంద్రబాబు సభకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. దీంతో అక్కడ తోపులాట జరిగి కొందరు కార్యకర్తలు రోడ్డు పక్కనున్న డ్రైనేజీ కాల్వలో పడిపోయారు. వెంటనే టీడీపీ లీడర్లు, మిగతా కార్యకర్తలు అప్రమత్తమై గాయపడిన వారిని కందుకూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 8 మంది చనిపోయారు. మిగతా వారు చికిత్స పొందుతున్నారు. దీంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.మృతుల కుటుంబాలకు తమ పార్టీ తరపున రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.