చంద్రబాబుకు మానవత్వం లేదు.. పేదలకు భూములను ఇవ్వనివ్వరా..

చంద్రబాబుకు మానవత్వం లేదు.. పేదలకు భూములను ఇవ్వనివ్వరా..

కృష్ణా జిల్లా బందరు పోర్టు నిర్మాణ పనులకు సీఎం వైఎస్‌ జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. బందరు పోర్టు పనులు మొదలు..అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వరకూ.. ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ.. చంద్రబాబుపై సెటైర్లు వేశారు. మధ్యలో పవన్‌ కళ్యాణ్‌ పైనా సీఎం జగన్ పంచ్‌లు పేల్చారు.

రాజకీయం కోసమే అప్పట్లో పోర్టుకు శంకుస్థాపన

టీడీపీ ప్రభుత్వం మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని  పొలిటికల్ స్టంట్గా మార్చిందన్నారు ఏపీ సీఎం జగన్. కేవలం రాజకీయ లబ్ధి కోసమే అనుమతులు పూర్తిగా రాకున్నా 2019 ఫిబ్రవరి 7న మాజీ సీఎం చంద్రబాబు మచిలీపట్నం పోర్టు  నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారన్నారు. ఫైనాన్షియల్‌ క్లోజర్‌, పర్యావరణ అనుమతులు, పోర్టు కనెక్టివిటీ రహదారులు ఏమీ లేకుండా, కనీసం సెంటు భూమి కూడా సేకరించకుండానే హడావిడి చేశారని విమర్శించారు. అప్పుడు నిర్మించిన పైలాన్‌ను ఓ ప్రైవేటు వ్యక్తి స్థలంలో నిర్మించి కనీసం ఆ రైతుకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదన్నారు. కానీ నేడు మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని అనుమతులను సమీకరించి, భూసేకరణ పూర్తి చేసి నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.

చంద్రబాబు మచిలీపట్నానికి తీవ్ర ద్రోహం

గతంలో బందరు జిల్లా హెడ్ క్వార్టర్ అయినా.. కలెక్టర్ తో సహా ఒక్క అధికారి కూడా ఇక్కడ ఉండేవారు కాదు. వారంలో ఒకరోజు వస్తే అదే పదివేలు అన్నట్లు పరిస్థితి ఉండేది. ఇప్పుడు కలెక్టర్ తో సహా మొత్తం యంత్రాంగం ఇక్కడే ఉంటున్నారు. చంద్రబాబు మచిలీపట్నానికి తీవ్ర ద్రోహం చేశారు. పోర్టు గ్రహణాలన్నీ తొలగిపోయాయి. ఇక అడుగులు వేగంగా పడతాయి. మచిలీపట్నం రూపు రేఖలు మారబోతున్నాయని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.

చంద్రబాబుకు మానవత్వం ఉందా..

విశాఖలో చంద్రబాబు చెప్పిన మాటలు బాధించాయని సీఎం జగన్ అన్నారు. పేదల ఇళ్లను సమాధి కట్టే స్థలమని చంద్రబాబు అంటారని .శ్మశానాలతో పోల్చిన చంద్రబాబుకు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. ఇళ్లు లేని పేదలకు ఎంత ఆవేదన ఉంటుందో అనే స్పృహ చంద్రబాబుకు ఉందా?  గతంలో కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దు అంటుందా అని చంద్రబాబు అన్న మాటలను గుర్తు చేస్తూ ..ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా అని ఈ వర్గాలను  టీడీపీ అధినేత అవమానించారని చంద్రబాబుపై జగన్ ఫైర్ అయ్యారు.
 

పేదలకు భూములను ఇవ్వనివ్వరా..

'బీసీల తోకలు కత్తిరిస్తాను చంద్రబాబు అన్నారని జగన్ తెలిపారు. రూపం మార్చుకున్న అంటరానితనపు పెత్తందారీ స్వభావం ఆయనదంటూ... చంద్రబాబు, దత్త పుత్రుడు అమరావతిలో పేదలకు భూములు ఇవ్వకుండా అడ్డుకుంటూ వచ్చారు. గజదొంగల ముఠా వారు మాత్రమే అమరావతిలో ఉండాలట.. ఇటువంటి సామాజిక అన్యాయం ఉంటుందా? దీన్ని ప్రజలు గమనించాలని ఏపీ సీఎం కోరారు. ఎవ్వరూ ఎన్ని కుట్రలు చేసినా.. మీ జగన్‌ మీకు తోడుగా.. అండగా ఉంటాడు. కానీ.. వారి కుట్రలను ప్రజలు గమనించాలి' అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.