మోడీ తీరుతో దేశం పరువు పోతోంది

మోడీ తీరుతో దేశం పరువు పోతోంది
  • మోడీ సేల్స్ మేన్‌లా వ్యవహరించిండు
  • ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం
  • మోడీ పాలనలో 8 రాష్ట్ర ప్రభుత్వాల్ని కూల్చారు
  • ఢిల్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధం
  • దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
  • యశ్వంత్ సిన్హా గెలుపుతో  దేశ గౌరవం పెరుగుతుంది

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ వల్ల దేశం పరువు పోతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. శ్రీలంకలో మోడీకి వ్యతిరేకంగా ఎందుకు నిరసనలు జరుగుతున్నాయో రేపటి బీజేపీ సభలో చెప్పాలని సవాల్ విసిరారు. శ్రీలంక విషయంలో మోడీ సేల్స్ మేన్‌లా వ్యవహరించారని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా ఓ అబద్ధమని, మోడీ పాలనలో దేశానికి ఏం ఒరిగిందని ప్రశ్నించారు. మోడీ నిర్ణయాలతో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. హైదరాబాద్ జలవిహార్ లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పరిచయ కార్యక్రమం నిర్వహించారు.

రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు అన్ని రంగాల్లో అనుభవం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. లాయర్ గా కెరీర్ మొదలుపెట్టి ఆర్థికమంత్రి స్థాయికి ఎదిగారని కొనియాడారు. విదేశాంగశాఖ మంత్రిగా పలు అవార్డులు అందుకున్నారని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు మనస్సాక్షిని అనుసరించి ఓట్లు వేయాలని కోరారు. యశ్వంత్ సిన్హా గెలుపుతో  దేశ గౌరవం పెరుగుతుందన్నారు. దేశంలో వ్యవస్థలు సరిగా పని చేయడం లేదని చెప్పారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ కు వస్తున్న మోడీ తమకు (రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్) వ్యతిరేకంగా చాలా చెబుతారని ఎద్దేవా చేశారు. తమపై ఎన్ని ఆరోపణలు చేసినా తమకు వచ్చే నష్టం ఏం లేదన్నారు. ఇప్పటివరకు ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను ఉగ్రవాదులు, ఖలిస్తాన్ లు అంటూ అవమానించారని, వారిపై కార్లు ఎక్కించారని ఆరోపించారు.

మోడీ బ్రహ్మ కాదు.. ప్రధానిగా శాశ్వతంగా ఉండేందుకు..

తమ ప్రభుత్వం పంజాబ్ రైతులకు పరిహారం ఇస్తే ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి.. ఆ తర్వాత వెనక్కి తీసుకుని, రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందన్నారు. ప్రధాని తప్పుడు నిర్ణయాల వల్లే 700 మంది రైతుల ప్రాణాలు పోయినా కూడా ఆయనకు బాధ లేదన్నారు. తప్పు చేయకపోతే రైతు చట్టాలను ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు. రైతులు 13 నెలలు ఆందోళనలు చేస్తే మోడీ భూతులు తిట్టారని చెప్పారు. రైతులపై జోకులు వేయడానికా మోడీని ప్రధాని చేసిందని ప్రశ్నించారు. అడ్మినిస్ట్రేషన్ లో ప్రధాని పూర్తిగా ఫెయిల్ అయ్యారన్నారు. ఎవరూ శాశ్వతం కాదని, మోడీ కంటే ముందు చాలామంది ప్రధానమంత్రులు అయ్యారని చెప్పారు. ‘ మోడీ బ్రహ్మ కాదు.. ప్రధానిగా శాశ్వతంగా ఉండేందుకు’ అని సెటైర్ వేశారు. ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో బాగా మాట్లాడుతారని, అవి అయిపోయాక అన్ని అబద్ధాలే చెబుతారని ఆరోపించారు. తామే పర్మినెంట్ అనే భ్రమలో మోడీ ఉన్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో రాజకీయ మార్పు తప్పకుండా జరుగుతుందని చెప్పారు.  ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న సీఎం కేసీఆర్... అభివృద్ధిలో తెలంగాణ ఎప్పుడూ వెనక్కిపోదన్నారు.

మోడీ పాలనలో 8  రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చారు

మోడీ పాలనలో (ఎన్డీయే) 8  రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు టార్చ్ లైట్ పెట్టి వెతికినా కనిపించవన్నారు. ఏ ఒక్క వర్గానికి మోడీ ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు. అంతర్జాతీయ ఇండెక్స్ లో భారతదేశం ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో తాము, ఫ్రెండ్లి పార్టీ కలిసి 95 సీట్లు గెలిచామన్నారు. తాము ఢిల్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. 

నల్లధనం ఎంత తీసుకొచ్చారో చెప్పాలి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోడీ ప్రచారం చేశారని, అయినా అక్కడ ట్రంప్ ఓడిపోయారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. అమెరికాలో జరిగే ఎలక్షన్స్ ను అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలు అనుకున్నారా..? అంటూ ప్రశ్నించారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అలా ప్రచారం చేయడం కరెక్టేనా..? అని ప్రశ్నించారు. 5 ట్రిలియన్ ఎకానమీ అంటూ మాట్లాడుతున్నారని.. కానీ కేవలం 3.1 ట్రిలియన్ ఎకానమీ దగ్గరే ఉన్నామన్నారు. వెనక్కి తీసుకొస్తామన్న నల్లధనాన్ని ఎంత తీసుకొచ్చారని ప్రశ్నించారు. నల్లధనాన్ని నియంత్రించకపోగా.. అది రెట్టింపు అయ్యిందన్నారు. మోడీ హయాంలో రూపాయి విలువ ఎక్కడుందని ప్రశ్నించారు.  రూ.18.60 లక్షల కోట్లు దేశంలో NPA ఉందన్నారు.  ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామన్న మోడీ ఇప్పటికీ 15 పైసలు కూడా వేయలేదని సెటైర్ వేశారు. మోడీ పాలనలో దేశంలోని అన్ని రంగాలు క్షీణించాయని విమర్శించారు. ఫియట్, ఫోర్డ్, జనరల్ మోటార్స్, డాట్సన్, హార్లే డేవిడ్ సన్ వెళ్లిపోయాయని, ఇదేనా దేశాన్ని పరిపాలించే పద్ధతి అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్,  గ్యాస్, ఎరువులతో పాటు అన్నింటి ధరలను పెంచారని మండిపడ్డారు. 

​​