వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు: సీఎం కేసీఆర్

వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు: సీఎం కేసీఆర్

వరంగల్‍/మహబూబాబాద్‌/నర్సంపేట/నల్లబెల్లి, వెలుగు: ‘వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు, ప్రభుత్వం అండగా ఉంటది, అద్భుతమైన సాయం చేస్తాం, మీకు ధైర్యం చెప్పేందుకే ఎండలో పడి వచ్చిన, ఎకరానికి రూ. 10 వేల పరిహారం ఇస్తాం’ అని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అకాల వర్షం, వడగండ్ల కారణంగా వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురం, మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం  రెడ్డికుంటలో దెబ్బతిన్న మక్కజొన్న, వరిని గురువారం పరిశీలించారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి బాధిత రైతులతో మాట్లాడి నష్ట తీవ్రతను తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ నష్టపరిహారం మునుపటి లెక్క లేట్‌ చేయం.. వెంటనే ఇచ్చేస్తామని చెప్పారు. కౌలు రైతులకు కూడా సాయం చేసేందుకు కలెక్టర్‌తో మాట్లాడుతానన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన టైంలో ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, శాసనమండలి డిప్యూటీ స్పీకర్‌ బండా ప్రకాశ్‍, జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, డీఎస్‌.రెడ్యానాయక్‌, శంకర్‌నాయక్‌, అరూరి రమేశ్‍, నన్నపునేని నరేందర్‍, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ స్మితా సబర్వాల్‌, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‍, కలెక్టర్లు ప్రావీణ్య, శశాంక్‌, సీపీ రంగనాథ్‌ ఉన్నారు.

కౌలు రైతుల పర్సంటేజీ చెప్పొద్దు

సీఎం కేసీఆర్‌ జిల్లా పర్యటనలో కౌలు రైతుల పై చర్చ జరిగింది. మహబూబాబాద్‌లో రైతులతో మాట్లాడుతున్న టైంలో కొందరు కౌలు రైతులు తమను ఆదుకోవాలని సీఎంను కోరారు. దీంతో మీ జిల్లాలో కౌలు రైతులు ఉన్నారా ? అని పక్కనే ఉన్న మంత్రి ఎర్రబెల్లిని ప్రశ్నించడంతో 30 శాతం ఉంటారని మంత్రి సమాధానమిచ్చారు. వెంటనే ‘అంతమంది ఉండరు, ఊరికో ఐదారుగురు ఉంటారు.. మహా అయితే 10 మంది ఉంటారు’ అని సీఎం చెప్పారు. అనంతరం వరంగల్‌ జిల్లా అడవి రంగాపురంలోనూ సీఎం కేసీఆర్‌ ఇదే టాపిక్‌ మాట్లాడుతూ కౌలు రైతులు ఎంత మంది ఉన్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని అడగడంతో 20 నుంచి 30 శాతం ఉంటారని చెప్పారు. దీంతో సీఎం అసహనం వ్యక్తం చేస్తూ ‘కౌలు రైతుల పర్సంటేజీ నీకేం  తెలుసయ్యా.. నువ్వేమన్నా లెక్కపెట్టినవా ? అలా పర్సంటేజీ చెప్పొద్దు.. ఊరికో ముగ్గురు, నలుగురు మాత్రమే ఉన్నరు.. ఇది వెరీ నార్మల్‌’ అని చెప్పారు. 

మంత్రి ఎర్రబెల్లిపై ఎమ్మెల్యేల ఆగ్రహం

సీఎం కేసీఆర్‌ టూర్‌లో నర్సంపేట, పరకాల నియోజకవర్గాల ప్రయారిటీ తగ్గేలా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యవహరించారని ఎమ్మెల్యేలు పెద్ది, చల్లా ధర్మారెడ్డి వాపోయారు. వడగండ్ల వాన కారణంగా గతేడాది, ఇప్పుడు వరంగల్‌ జిల్లాలోనే అత్యధికంగా పంట నష్టం జరగడంతో సీఎం దుగ్గొండి, గీసుకొండ, సంగెం మండలాల్లో పర్యటిస్తారని స్థానిక లీడర్లు భావించారు. కానీ చివర్లో మహబూబాబాద్‌ జిల్లా చేరడంతో సీఎం కేసీఆర్‌ వరంగల్‌ జిల్లాలో పూర్తి స్థాయిలో పర్యటించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి దయాకర్‍రావు కావాలనే తమ ప్రయారిటీ తగ్గించారని అంటున్నారు.

ప్రతిపక్ష లీడర్ల ముందస్తు అరెస్ట్‌‌లు

తొర్రూరు/కొత్తగూడ, వెలుగు : సీఎం కేసీఆర్‌‌ పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష లీడర్లు, ప్రజాసంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అర్సెట్‌‌ చేశారు. మహబూబాబాద్‌‌ జిల్లా తొర్రూరు, పెద్దవంగర, కొత్తగూడకు చెందిన బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, టీచర్స్‌‌, యాదవ సంఘం, అఖిలపక్ష లీడర్లను అరెస్ట్‌‌ చేసి తొర్రూరు, నర్సింహులపేట పీఎస్‌‌కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేసీఆర్‌‌ నియంతృత్వ పాలనతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్‌‌ చేయడం సరికాదన్నారు.