త్వరలో జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలుపెడ్త

త్వరలో జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలుపెడ్త

2024లో ఢిల్లీ గద్దెపై తమ ప్రభుత్వమే కొలువుదీరుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముక్త్ భారత్ కోసం ప్రజలు ఓటు వేయాలని కోరారు. నిజామాబాద్లో గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రజల కోరిక, ఆశీస్సులతో త్వరలోనే జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానని కేసీఆర్ స్పష్టంచేశారు.   

2024 తర్వాత ఫ్రీ కరెంట్

2024లో దేశంలోని రైతులందరికీ ఫ్రీ కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజలంతా ఏకమై బావుల దగ్గర మీటర్లు పెట్టాలంటున్న వారికి మీటర్ పెట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ ముక్తభారత్ నినాదంతో ముందుకు వెళ్తామని ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. దేశం బాగుపడాలంటే ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉండాలని.. ప్రజాస్వామ్యబద్ధంగా దేశాన్ని ముందుకు తీసుకపోయే లౌకికవాద ప్రభుత్వం అవసరమన్నారు. మోడీ ప్రభుత్వం అహంకారంతో ప్రతిపక్షాలను చీల్చి ప్రభుత్వాలను పడగొడుతుందని మండిపడ్డారు. మోడీ విధానాలతో అంతర్జాతీయంగా దేశం పరువుపోయే పరిస్థితి ఏర్పడిందని కేసీఆర్ అన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన కేంద్రం మతపిచ్చితో మంటలు పెడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో గోదావరి నీళ్లు పారాల..లేక మతపిచ్చితో నెత్తురు పారాల అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. దేశంలో రైతులు వాడే కరెంట్ 20.8 శాతమే అని..దానికి లక్షా 45వేల కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందన్నారు. రైతుల కోసం లక్షా 45 వేల కోట్లు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. 

మీటర్లు పెట్టాలన్నోళ్లకు మీటర్ పెట్టాలె
బావుల దగ్గర మోటర్లుకు మీటర్లు పెట్టాలంటున్న మోడీకి బుద్ది చెప్పాలని సీఎం కేసీఆర్ అన్నారు.  రైతుల భూములు లాక్కోవాలన్నదే బీజేపీ ప్లాన్ అని, అన్నదాతలు వ్యవసాయం బంద్ పెడితే భూములు కొనేందుకు కార్పొరేట్ గద్దలు వాలుతాయని హెచ్చరించారు. మోడీ సర్కారు అన్నింటినీ అమ్ముకుంటూ పోతుంటే.. టీఆర్ఎస్ సర్కారు మాత్రం సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలను ఆదుకుంటోందని కేసీఆర్ అన్నారు. ఉచిత పథకాలను రద్దు చేయాలంటున్న బీజేపీ సర్కారును సాగనంపాలని పిలుపునిచ్చారు.

నాన్ బీజేపీ జెండా ఎగరబోతోంది

దేశంలో 83కోట్ల ఎకరాల భూమి ఉంటే..41కోట్ల ఎకరాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉందని కేసీఆర్ చెప్పారు. మోడీ అధికారంలోకి వచ్చిన నుంచి ఒక్క ప్రాజెక్ట్ గానీ ఒక ఫ్యాక్టరీ గానీ కట్టారా అని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ దేశాన్ని మోడీ ఆగం చేస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కార్మిక, ప్రజావ్యతిరేక ప్రభుత్వం పోయి..నాన్ బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

సంక్షేమ పథకాల్లో మనమే నెంబర్ వన్

పాలకుల ఏమరపాటు వల్ల తెలంగాణను ఆంధ్రాలో కలిపారని, మన తెలంగాణ మనం తెచ్చుకోనీకే 60 ఏండ్లు పట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. వలస పాలనలో సింగూరు, నిజాం సాగర్ నీళ్లు మనకు లేకుండా పోయాయని చెప్పారు. దేశంలో అన్ని రంగాలకు 24గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోమే మనమే నెంబర్ వన్ అని చెప్పారు. దళిత  కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇచ్చే రాష్ట్రం తమదేనన్న కేసీఆర్... తండాలను గ్రామాలుగా మార్చిన ఘనత తమ ప్రభుత్వ సొంతమని చెప్పారు. నిజామాబాద్ లో గుంట వ్యవసాయ భూమి కూడా ఖాళీగా ఉండొద్దని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.