నిజామాబాద్, వెలుగు: పదేండ్ల అధికారంలో ఎగిరెగిరిపడ్డ బీఆర్ఎస్ ఇప్పుడు కనబడ్తలేదని తన పార్లమెంట్సెగ్మెంట్లో చాలా తగ్గిపోయిందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల సన్మాన సభలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు అసెంబ్లీ బడ్జెట్, వర్షాకాలం, చలికాలం సమావేశాలు రెండు నెలల పాటు జరిగేవని కేసీఆర్ వచ్చాక వాటిని గణనీయంగా కుదించారన్నారు.
తనను ప్రశ్నించేవారుండొద్దని అసెంబ్లీ మీటింగ్‌లకు ప్రయారిటీ ఇచ్చేవారుకాదన్నారు. అడ్డగోలు రాజకీయాలతో కేసీఆర్ అంతా నాశనం చేయగా సీఎం రేవంత్‌రెడ్డి వారి బాటలో నడుస్తూ ప్రజాస్వామ్యాన్ని అధ:పాతాళానికి తొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. ముస్లింలను పక్కన పెట్టుకొని మనుగడ సాగిస్తున్న కాంగ్రెస్‌కు వారులేకుంటే జీరో అవుతామనే భయం ఉందన్నారు. బీజేపీ హుందా రాజకీయాలు చేస్తుందన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచిన సెగ్మెంట్‌గా నిజామాబాద్‌ను నిలబెట్టామన్నారు. ఇందూర్ కార్పొరేషన్‌లోని 60 డివిజన్ల్లో 28 స్థానాలు గెలిచి నంబర్ వన్ అయ్యామన్నారు. మేయర్ సీటు రాలేదనే బాధలేదు. యుద్ధం గెలిచామన్న సంతోషం ఉంది. భవిష్యత్ రాజకీయాలు బీజేపీవేనని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సత్తా చాటుతామన్నారు. ఎంపీ ఈటల రాజేందర్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నేషనల్ టర్మరిక్ బోర్డ్ చైర్మన్ పల్లెగంగారెడ్డి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ దినేశ్, కాంతారావు, మల్లికార్జునరెడ్డి, మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి ఉన్నారు.
