10 రోజుల్లో రైతు బంధు: సీఎం కేసీఆర్

10 రోజుల్లో రైతు బంధు: సీఎం కేసీఆర్

అన్నదాతలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. మరో పదిరోజుల్లోపూ రైతు బంధు నగదు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేబినెట్ మీటింగ్ లో రైతు బంధుపై నిర్ణయం తీసుకుంటామని..ఆ తర్వాత రైతు బంధు నిధులు విడుదల చేస్తామన్నారు. బ్యాంకుల్లో  డబ్బులు జమ చేయగానే..రైతుల ఫోన్లలో టింగు టింగు మంటూ మేసేజ్ లు వస్తాయన్నారు. ఎక్కడైనా ఈ తరహా పథకం ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ బతికున్నంత వరకు రైతు బంధు, రైతు బీమా  పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. 

ఇదేనా మేకిన్ ఇండియా...?

దేశంలో ఎక్కడ చూసిన చైనా బజార్లే దర్శనమిస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. పిల్లలు కాల్చే పటాకులు, పతంగులతో పాటు.. జాతీయ జెండాలను కూడా బీజేపీ ప్రభుత్వం  చైనా నుంచి దిగుమతి  చేసుకుంటుందన్నారు. ఇదేనా మేకిన్ ఇండియా అని ప్రశ్నించారు. ఊరూరా చైనా బజార్లు ఎందుకు వస్తున్నాయన్నారు. కుర్చీలు, నెయిల్ కట్టర్లు, బొమ్మలు.. అన్నీ చైనా నుంచే వస్తున్నాయన్నారు. మాట్లాడితే మేకిన్ ఇండియా అని డైలాగులు కొట్టే మోడీ...ప్రధానిగా ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 

మోసపోయి ఉంటే గోసపడతాం...

దేశ రాజధాని ఢిల్లీతో పాటు..మోడీ సొంత రాష్ట్ర గుజరాత్ లో కరెంట్ కోతలు, సాగునీటికి ఇబ్బందులున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. యూపీలో ఇప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు, దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. నాటు స్వాతంత్య్రం కోసం ఎంతో మంది యోధులు పోరాడారని..ప్రాణాలు అర్పించి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని చెప్పారు. ఇందుకోసమేనా వారు స్వాతంత్య్రం తెచ్చిందని ప్రశ్నించారు. దేశంలోని ప్రతీ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా అవ్వాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు ఉండొద్దని చెప్పారు. దేశ భవిష్యత్ కోసమే చెప్తున్నానని.. మోసపోయి ఉంటే గోసపడతామని ప్రజలు ఆలోచించాలన్నారు.