తడిసిన వడ్లనూ మద్దతు ధరకు కొంటం : కేసీఆర్

తడిసిన వడ్లనూ మద్దతు ధరకు కొంటం : కేసీఆర్
  • తడిసిన వడ్లనూ మద్దతు ధరకు కొంటం
  • చివరి గింజ వరకు కొనుగోలు చేస్తం: కేసీఆర్
  • కొనుగోళ్లపై సెక్రటేరియెట్​లో రివ్యూ

హైదరాబాద్, వెలుగు:   అకాల వర్షాలకు తడిసిన వడ్లను కొనుగోలు చేస్తామని, వాటికి కూడా మద్దతు ధర చెల్లిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, వీలైనంత త్వరగా ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని తెలిపారు. మంగళవారం కొత్త సెక్రటేరియెట్ లో యాసంగి వడ్ల కొనుగోలు, అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన వడ్ల సేకరణపై కేసీఆర్ రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడగండ్ల వానలతో పంట దెబ్బతిన్న రైతులను ఆదుకుంటున్నామని, ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తున్నామని తెలిపారు. ఆర్థికంగా ఖజానాపై భారం పడినా, రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని చెప్పారు. యాసంగి పంటలు మార్చిలోపే చేతికొచ్చేలా ప్రణాళిక రూపొందించాలని, ఇందుకోసం ఎలాంటి విధానాలు అవలంబించాలో అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘‘ఏప్రిల్, మే దాకా వరి పంటను నూర్పకుంటే ఎండలు ఎక్కువై ధాన్యంలో నూక శాతం పెరుగుతోంది. మరోవైపు అకాల వర్షాల వల్ల పంట నష్టం జరుగుతోంది. అటు నూక శాతం తగ్గాలన్నా, అకాల వర్షాల నుంచి తప్పించుకోవాలన్నా మార్చి నెలాఖరుకల్లా పంట కోతకొచ్చేలా ముందుగానే నాట్లు వేసుకోవాలి” అని రైతులకు సూచించారు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో వరి కోతలను మరో మూడు నాలుగు రోజులు వాయిదా వేసుకోవడం మంచిదన్నారు. 

యాసంగి పంటల సాగు సమయంతో పాటు ఫర్టిలైజర్స్ వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వ్యవసాయంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను రైతులకు వివరిస్తూ పోస్టర్లు, అడ్వర్టయిజ్ మెంట్ల ద్వారా ప్రచారం చేయాలన్నారు. ‘‘రాష్ట్రంలో నిర్మించిన రైతు వేదికల ద్వారా వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలి. ఎవరైనా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటం” అని హెచ్చరించారు. సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సీఎస్​శాంతికుమారిని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సివిల్ సప్లైస్ కమిషనర్ వి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

అగ్రికల్చర్, సివిల్​సప్లయ్స్​ మంత్రులు లేకుండానే.. 

 
కేసీఆర్ చేసిన ఈ రివ్యూలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి, సివిల్​సప్లయ్స్​మినిస్టర్​గంగుల కమలాకర్ ఇద్దరూ లేరు. గతంలో ప్రగతి భవన్​లో సంబంధిత మంత్రులు లేకుండానే రివ్యూలు జరిగేవి. ఇప్పుడు కొత్త సెక్రటేరియెట్​లోనూ మంత్రులు లేకుండానే రివ్యూ జరిగింది. ఈ సమావేశంపై సంబంధిత మంత్రులకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు సివిల్​సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ కూడా రివ్యూ మీటింగ్​లో లేరు. బీమా సొమ్ము వారంలోనే అందేలా మార్పులు చేయాలి

గీత కార్మికుల ప్రమాద బీమా స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్పులు చేయాలని మంత్రులు హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. బీమా సొమ్ము ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని, దీన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. రైతు బంధు తరహాలో బాధిత కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా సొమ్ము అందేలా చర్యలు ఉండాలన్నారు. నేరుగా నామిని అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డబ్బులు జమయ్యేలా విధివిధానాలను రూపొందించాలన్నారు. ఈ మేరకు సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రులు, అధికారులతో గీత కార్మికుల బీమా స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సీఎం కేసీఆర్ మంగళవారం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కల్లుగీత సమయంలో ప్రమాదవశాత్తూ జారిపడి ప్రాణాలు  కోల్పోతున్న దురదృష్ట ఘటనలు జరుగుతుంటాయన్నారు. అటువంటి బాధకర సందర్భాల్లో మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందన్నారు. ఇప్పటికే ఎక్స్ గ్రేషియా అందిస్తున్నా బాధితులకు అందడంలో ఆలస్యం అవుతోందని, ఈ ఆలస్యాన్ని నివారించాలని సూచించారు. ఇందుకు సంబంధించి  చర్యలు చేపట్టాలని మంత్రులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.