జగన్ తో మాట్లాడానన్న కేసీఆర్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అంగుళానికి నీళ్లు

జగన్ తో మాట్లాడానన్న కేసీఆర్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అంగుళానికి నీళ్లు

తెలుగు రాష్ట్రాలకు అందుబాటులో 5 వేల టీఎంసీలు

కలిసి పంచుకుంటే ప్రతి అంగుళానికీ నీళ్లు

సీతారామ, దేవాదుల ప్రాజెక్టులు ఈ ఏడాదే పూర్తి చేస్తాం

అసెంబ్లీ, సెక్రటేరియెట్ నిర్మాణానికి 27న భూమిపూజ

డైరెక్టర్ ఎన్. శంకర్కు 5 ఎకరాలు.. శారదా పీఠానికి 2 ఎకరాలు

30 జిల్లాల్లో టీఆర్ఎస్ ఆఫీసులకు స్థలాలు

కేబినెట్​ భేటీ అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్

హైదరాబాద్‌, వెలుగు: గోదావరి, కృష్ణా నదుల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి అంగుళానికి నీళ్లివ్వాలని ఏపీ సీఎం జగన్​, తాను నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్​ తెలిపారు. ఆంధ్రప్రదేశ్​తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని కేబినెట్​ సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియట్​ను నిర్మిస్తామని, ఈ నెల 27న ఆ రెండు భవనాలకు భూమిపూజ చేస్తామని ఆయన వెల్లడించారు. జులై నెలలోనే మున్సిపల్​ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్​ నిర్ణయించిందన్నారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్​ వస్తారని, జులై చివరి నాటికి మిషన్​ భగీరథ పూర్తి అవుతుందని పేర్కొన్నారు. మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్​ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ ఐదు గంటలకు పైగా కొనసాగింది. తర్వాత సీఎం కేసీఆర్​ కేబినెట్​ నిర్ణయాలను వెల్లడించారు. ఏపీ సీఎం జగన్​తో ఇటీవల జరిగిన చర్చల సారాంశాన్ని వివరించారు. గోదావరి, కృష్ణా నదుల్లో 3 వేల టీఎంసీలకు పైగా నీళ్లున్నాయని, చాలా సందర్భాల్లో 5 వేలు, 6 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోతున్నాయని ఆయన పేర్కొన్నారు.

‘‘ఇంతకు ముందు పొరపొచ్చాలు.. అవసరం లేని కయ్యాలు పెట్టుకొని తెలుగు ప్రజలు నష్టపోయిండ్రు. కేంద్రం పరిష్కారం చేయాల్సిన దుస్థితి ఉండొద్దని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులం అనుకున్నం. గవర్నర్​ పిలిచి పంచాయితీ పెట్టుడు.. సర్ది చెప్పుడు ఉండొద్దు అనుకున్నం. ప్రతి దానికీ కేంద్రంకాడికి పోవద్దనుకున్నం. రెండు నదుల్లో ఉన్న 5 వేల టీఎంసీలను తెలంగాణ, ఆంధ్రాలోని ప్రతి అంగుళానికి తీసుకుపోవాలని నిర్ణయానికి వచ్చినం. పరస్పర సహకారంతో పనిచేస్తం.. దాని ఫలితాలు కూడా రాబోయే రెండు మూడేండ్లల్లో ప్రజలకు చూపిస్తం..’’ అని కేసీఆర్‌‌ పేర్కొన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌ ఉన్నప్పుడు మహారాష్ట్రతో, కర్నాటకతో బస్తీమే సవాల్‌‌ అన్నట్టుగా పరిస్థితి ఉండేదని, అనేక అంశాల్లో అంతులేని వివాదాలు ఉండేవని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం తీసుకున్న నిర్ణయాలతో పొరుగు రాష్ట్రాలతో స్నేహసంబంధాలు ఏర్పడ్డాయని తెలిపారు. ఏపీలో అధికార మార్పిడి తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు సుహృద్భావపూరిత వాతావరణంలో జరిగాయన్నారు.

తెలుగు ప్రజలకు శుభం కలుగాలని కోరుకున్నామని ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి బేషజాలకు పోకుండా భవనాల అప్పగింతకు ముందుకు వచ్చిందని, దీంతో మంచి వాతావరణం ఏర్పడిందని  అన్నారు. బుధవారం హైదరాబాద్​లోని ఏపీ భవనాలను ఖాళీ చేసి తాళాలు హ్యాండోవర్‌‌ చేస్తారని తెలిపారు. విభజన చట్టంలోని అంశాలు, ఇతర ఒప్పందాలు.. రవాణా.. వాహన పర్మిట్లు ఇతర సమస్యలు ఏవైనా సరే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకుంటామన్నారు. గణేశ్‌‌ నిమజ్జనం సమయంలో రాష్ట్రానికి ఏపీ నుంచి ఫోర్స్‌‌ అవసరముంటుందని, అక్కడి విపత్తులు సంభవించినప్పుడు, ఇతర సందర్భాల్లో మన అవసరం వారికి ఏర్పడవచ్చన్నారు. ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో గతంలో ఎన్నడూ చూడని ఫలితాలను చూడబోతున్నట్లు చెప్పారు. ఇదే ఉత్తమమైన మార్గమని కేబినెట్‌‌లో యునానమస్‌‌గా తీర్మానించామని, అదే పంథా కొనసాగిస్తామని సీఎం కేసీఆర్​ తెలిపారు.

రూ. 400 కోట్లతో కొత్త సెక్రటేరియెట్‌‌

కొత్త సెక్రటేరియట్​ భవనాన్ని, కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ఇప్పుడున్న సెక్రటేరియట్​ స్థలంలోనే కొత్త సెక్రటేరియేట్​ను కడుతామని చెప్పారు. ‘‘సెక్రటేరియట్​ కోసం గతంలో బైసన్​పోల్​ గ్రౌండ్​ కావాల్నని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినం. గతంలో ఉన్న ఏపీ ప్రభుత్వం మొండికేసి పదేండ్ల దాకా సెక్రటేరియేట్ ఇచ్చేది లేదంది. కాబట్టి.. ప్రత్యామ్నాయం కోసం అన్వేషించినం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి ఇక్కడే కట్టాలని నిర్ణయించినం. ఇప్పుడున్న సెక్రటేరియట్​ స్థలం అనువుగా కూడా ఉంది.. ప్లేస్​ కూడా బాగుంది. లేక్​ వ్యూ కూడా ఉంది. అందుకే ఇక్కడే కట్టాలని నిర్నయించినం. అత్యంత మాడ్రన్​ బిల్డింగ్​ కట్టుకుంటే కూడా రూ. 400 కోట్లతో పూర్తవుతుంది’’ అని పేర్కొన్నారు. ఐదు లక్షల స్క్వేర్‌‌ ఫీట్ల నుంచి ఆరు లక్షల స్క్వేర్‌‌ ఫీట్ల సెక్రటేరియట్‌‌ కడితే సరిపోద్ది అనుకున్నామన్నారు. ఇప్పుడున్న సెక్రటేరియట్‌‌లోని భవనాలు ఒక్కో తీరుగా ఉన్నాయని, కొన్ని 50, 60 ఏండ్ల కింద నిర్మించినవి అయితే, మరికొన్ని 15 ఏండ్ల కింద కట్టినవి అని ఆయన చెప్పారు.

అన్ని భవనాలను కూల్చి కొత్త సెక్రటేరియట్‌‌ కట్టాలా, కొన్ని భవనాలను అలాగే ఉంచి గ్రీన్‌‌ ఫీల్డ్‌‌ చేసి కట్టాల్నా అనే నిర్ణయం ఆర్‌‌ అండ్‌‌ బీ మంత్రి నేతృత్వంలోని కేబినెట్‌‌ సబ్‌‌ కమిటీ నిర్ణయిస్తుందన్నారు. ఈ కమిటీ సూచనలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ముఖ్యమంత్రికి ఇస్తూ కేబినెట్‌‌ తీర్మానం చేసిందని ఆయన తెలిపారు. సెక్రటేరియట్‌‌కు ఫ్రంట్‌‌ సైడ్‌‌ ఎలివేషన్‌‌ ఇలా ఉంటుంది అంటూ తమిళ ఆర్కిటెక్ట్‌‌ పంపిన డిజైన్‌‌ను సీఎం మీడియాకు చూపించారు. దానిని ఇంకా ఫైనల్‌‌ చేయలేదని, హఫీజ్‌‌ కాంట్రాక్ట్‌‌ కూడా డిజైన్లు ఇచ్చారని తెలిపారు. భూమి పూజ చేసుకున్న తర్వాత భవనాల కూల్చివేతపై నిర్ణయం తీసుకొని కొత్త నిర్మాణం మొదలు పెడతామన్నారు. ఇప్పుడున్న సెక్రటేరియట్‌‌లోని కార్యాలయాలను ఆలోగా తరలిస్తామని చెప్పారు.

పార్లమెంట్​ మోడల్​లో అసెంబ్లీ

హైదరాబాద్​ ఎర్రమంజిల్​లోని ఇంజినీరింగ్​ భవనాలు ఉన్న చోట అసెంబ్లీని నిర్మిస్తామని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. ఇందులోనే శాసన మండలిని కూడా నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇప్పుడున్న అసెంబ్లీ భవనం రాజుల నుంచి వారసత్వంగా వచ్చినందున అట్లనే  ఉంచుతామని, హెరిటేజ్​గా అది కొనసాగుతుందని తెలిపారు. ‘‘మూడింటి సమాహారంగా అసెంబ్లీని నిర్మిస్తం.  పార్లమెంట్​ మోడల్​లో ఉంటది. సెంట్రల్​ హాల్​, అసెంబ్లీ హాల్​, కౌన్సిల్​ హాల్​ ఉంటయి. అన్ని రకాల చాంబర్లు, లెజిస్లేటివ్‌‌ సెక్రటేరియట్‌‌తో గొప్ప రిచ్‌‌గా భవనం నిర్మించబోతున్నం”  అని కేసీఆర్​ అన్నారు. రూ. వంద కోట్లతో  దీన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇప్పుడున్న అసెంబ్లీ తరహాలో ఎలివేషన్‌‌ ఉండేలా భవనాన్ని డిజైన్‌‌ చేస్తున్నట్లు చెప్పారు. ఎర్రమంజిల్‌‌లో స్థలం కూడా ఎత్తులో అందరికీ కనబడేలా ఉంటుందన్నారు.  ఈ నెల 27న దశమి మంచి రోజు అని, ఆ తర్వాత దసరా దాక మంచి రోజులు లేవని సీఎం చెప్పారు. అందుకే 27న కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియేట్​కు భూమిపూజ చేస్తామని తెలిపారు.

పంచాయతీరాజ్‌‌ వ్యవస్థను క్రియాశీలం చేస్తాం

నూతన పంచాయతీరాజ్‌‌ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. ‘‘అందరూ గెలిచిన ఉత్సాహంగా ఉన్నారు.. విద్యాధికులు జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలుగా ఉన్నరు. గత టర్మ్‌‌లో నిధుల్లేక నిష్క్రియపరంగా ఉన్నరు.. ఇప్పుడు వారికి హరితహారం, గ్రామీణ ఉపాధి హామీ పథకం.. ఇలా ఇంకేం అప్పగించవచ్చు అని చర్చిస్తం. వారికి అధికారాలు, నిధులను సమకూర్చాలని కేబినెట్‌‌లో చర్చ జరిపినం.. అధికారాలు బదలాయిస్తం. పంచాయతీరాజ్‌‌ వ్యవస్థను క్రియాశీలం చేస్తం’ అని వివరించారు.