
సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంత్రులతో అత్యవసర భేటీ నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఉన్నట్టుండి.. ఎర్రవల్లి ఫాంహౌస్ కు రావాలంటూ మంత్రులకు ఫోన్ కాల్స్ వెళ్లాయి. దీంతో హుటాహుటిన మంత్రులు ఫాంహౌస్ చేరుకున్నారు.. మంత్రులతో పాటు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కూడా ఫాంహౌస్ కు చేరుకున్నారు. మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్, గంగుల కమలాకర్.. ఎర్రవల్లి ఫాంహౌస్ చేరుకున్నారు. మంత్రి హరీష్ రావు అర్ధాంతరంగా కార్యక్రమాలు ముగించుకొని ఫాంహౌస్ వెళ్లారు. కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లగా.. మంత్రి నిరంజన్ రెడ్డి మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. పువ్వాడ అజయ్ ఖమ్మంలోనే ఉన్నారు. సిటీలో అందుబాటులో ఉన్న ఇతర మంత్రులు కూడా ఫాంహౌస్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ అత్యవసర సమావేశంపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.