ఇబ్రహీంపట్నం ఘటనపై సీఎం కేసీఆర్ రివ్యూ చేయలే

ఇబ్రహీంపట్నం ఘటనపై సీఎం కేసీఆర్ రివ్యూ చేయలే

ఇబ్రహీంపట్నం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని..చనిపోయిన వారికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబాల పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ఆపరేషన్ చేసుకున్న వారు ఇప్పట్లో పని చేసుకోలేని పరిస్థితి ఉన్న క్రమంలో.. వారిని ఆర్థికంగా ఆదుకోవాలని సూచించారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా.. సీఎం కేసీఆర్ రివ్యూ చేయలేదని విమర్శించారు. గంటలో 34 మందికి ఆపరేషన్ చేశారని.. ప్రతి 2 నిమిషాలకు ఒక్కో ఆడపడుచుకు ఆపరేషన్ చేశారన్నారు. నిర్లక్ష్యం వల్ల.. సరైన వసతులు లేకపోవడం వల్ల నలుగురు ఆడపడుచులు చనిపోయారన్నారు. ప్రస్తుతం ఉన్న వారి పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు అర్థమౌతోందన్నారు. విపత్కరమైన పరిస్థితులుంటే... పర్యవేక్షించడానికి ఒక్క అధికారి లేడన్నారు. ఈ విషయంలో కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను అడిగినట్లు చెప్పారు. అపోలో ఆసుపత్రిలో ఇబ్రహీంపట్నం బాధితులను రేవంత్ పరామర్శించారు.

ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నిమ్స్, ఉస్మానియా, గాంధీల ఆసుపత్రులకు తరలించకుండా.. కార్పొరేట్ హాస్పిటల్స్ కు తరలించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎంతమంది ప్రమాదంలో ఉన్నారు ? చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 20వ తేదీ ఘటన జరిగితే.. సంబంధిత శాఖ మంత్రి కుటుంబసభ్యులను పరామర్శించలేదన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లడం, విందులు చేసుకోవడం సీఎం కేసీఆర్ కే చెల్లిందని విమర్శించారు. త్వరలోనే రాష్ట్రంలో ప్రతి ఒక్కో వ్యక్తికి హెల్త్ ప్రోఫైల్ చేయడం జరుగుతుందని సిద్ధిపేట నియోజకవర్గంలోని చింతమడకలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాల్టీ, ప్రతి జిల్లాల్లో 100 పడకలు, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రులు నిర్మిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పిందని విమర్శించారు.